ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. రోజురోజుకు పార్టీ తరపున ఈ ఆందోళనలను ఉధృతం చేస్తున్న చంద్రబాబు... తాజాగా అమరావతి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్అనుసరించిన వ్యూహాన్ని ఫాలో అవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యంకాదని భావించిన కేసీఆర్... 2010లో తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసింది. ఈ జేఏసీలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా భాగస్వామ్యం అయ్యేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో తెలంగాణ జేఏసీ ఎంతో కీలకంగా వ్యవహరించింది. జేఏసీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగాలనే దానిపై కేసీఆర్తో పాటు ఇతర నాయకులు తమ వంతు ఆలోచనలు చేశారు. తాజాగా అమరావతి విషయంలోనూ చంద్రబాబు ఇదే రకంగా జేఏసీ ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీని ఏర్పాటు చేసిన చంద్రబాబు... ఈ జేఏసీ కోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ జేఏసీలో టీడీపీతో పాటు అమరావతి రైతులు, సీపీఐ వంటి పార్టీలు మాత్రమే భాగంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ జేఏసీని మరింతగా విస్తరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో జేఏసీని ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన కేసీఆర్ బాటలో వెళుతున్న చంద్రబాబు... అమరావతి విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.