ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి పండగ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సంక్రాంతి పండగను అమరావతిలోనే రైతుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అమరావతిలోనే రైతుల మధ్య ప్రకటించారు. అమరావతిలోని రైతుల ఆందోళనలు చేస్తుంటే... తాను సొంత ఊరిలో పండగ చేసుకోవడం సరికాదని చంద్రబాబు భావించారు. ఈ కారణంగానే ఆయన ఈ సారి సంక్రాంతిని నారావారిపల్లెకు బదులుగా అమరావతిలో చేసుకోవాలని నిర్ణయించారు. సంక్రాంతికి తమ సొంత ఊరు నారావారిపల్లెకు వెళ్లడం చంద్రబాబు కుటుంబం అనవాయితీగా పాటిస్తోంది. వీలును బట్టి సంక్రాంతికి రెండు మూడు రోజుల పాటు చంద్రబాబు నారావారిపల్లెలోనూ గడుపుతుంటారు.   అధికారిక కార్యక్రమాలను కూడా అక్కడ నుంచే నిర్వహించేవారు చంద్రబాబు. చంద్రబాబు కుటుంబంతో పాటు నందమూరి బాలకృష్ణ కుటుంబం సైతం సంక్రాంతికి నారావారిపల్లెకు తరలివెళ్లేది. అయితే చంద్రబాబు నిర్ణయంతో ఈ సారి బాలకృష్ణ ఫ్యామిలీ సైతం అమరావతిలోనే సంక్రాంతి జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అధికారానికి దూరమైన తొలి ఏడాది సంక్రాంతి పండగకు చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లెకు దూరంగా ఉండబోతున్నారు.