ఇద్దరు సీఎంలు ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలో ఇరు రాష్ట్రాల ముఖ్య అధికారులు ఉంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించిన తరువాత కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఇద్దరు సీఎంలు సమస్యపై తుది పరిష్కారానికి కసర్తతు చేసే అవకాశం ఉంది. తాజా భేటీ చూస్తే కచ్చితంగా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.
వీరిద్ధరి భేటిలో అత్యధికంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అరుదైన ఈ భేటీలో.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర రైతుల కల సాకారం అవుతుందని భావిస్తున్నారు. కొఠియా గ్రామాలకు సంబంధించి సీఎం జగన్ సూచనలపై సీఎం నవీన్ పట్నాయక్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
ఒడిషా వెళ్లేముందు విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.