మరోసారి ఫ్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఈ క్రమంలోనే ఫలితాలు రాకముందే ఆయన ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వాళ్లు బీజేపీ వైపు మొగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు మద్దతుగానే ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లోని నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు... అందుకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ చర్చిస్తున్నారు.
వామపక్షాలు, ఆప్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలతో చర్చించిన చంద్రబాబు... కేంద్ర రాజకీయాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చాలాకాలంగా చర్చల జరుపుతూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు... ఆ పార్టీకి సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు మాత్రం అంత సుముఖంగా లేవని తెలుస్తోంది.
మోదీని అధికారానికి దూరంగా ఉంచాలంటే ప్రస్తుతానికి మూడో ఫ్రంట్ ఒక్కటే మార్గమనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి... కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందుకు ఫెడరల్ ఫ్రంట్ అని పేరు కూడా పెట్టారు.
అయితే ఫెడరల్ ఫ్రంట్ తరహాలోనే చంద్రబాబు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసి... ఈ కూటమిని కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా ఓ ఫ్రంట్‌ను తానే ఏర్పాటు చేయడం ద్వారా తన రాజకీయ శత్రువులైన మోదీ, కేసీఆర్, జగన్‌లకు చెక్ పట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారని టాక్.
అయితే బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.