MLA Roja: ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో ఉన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ప్రజలతో కలిసే ఉంటున్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు. త్వరలో మంత్రి పదవి ఆశిస్తున్న ఆమె అందుకే అంత యాక్టివ్ గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్న భర్తతో కలిసి కబడీ కోర్టులో దిగిన ఆమె.. నిన్న యూత్ తో కలిసి వాలీబాల్ ఆడారు. ఇవాళ డప్పు కొట్టి సందడి చేశారు.
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని పేర్కొన్నారు.
వైసీపి ప్రభుత్వం పేదలకు, పేద కళాకారులకు,డప్పు కళాకారులతో పాటు అన్ని వర్గాలకు చేందిన చిన్న చిన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుల ద్వారా తరతరాలుగా సమాజాన్ని చైతన్య పరిచిన సంప్రదాయ కళాకారులను ప్రోత్సహిస్తూ ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అవార్డులను ప్రకటించడం జరిగిందన్నారు.. వీరిలో ప్రముఖ డప్పు కళాకారుడు గోచీపాత గాలేబుకి ప్రభుత్వం వైఎస్ఆర్ అచివేమెంట్ అవార్డు ఇచ్చి గుర్తించిందన్నారు.
ఈ డప్పు కళాకారులు కూడా ఓ పండగొచ్చినా, ఓ జాతరొచ్చినా,
ఓ సభ జరగాలన్నా, ఓ చాటింపు వేయాలన్నా, ప్రతీ ఊర్లోనూ వీరి అవసరం ఉంటుందని రోజా తెలిపారు. పెళ్లైనా, చావైనా సరే మన జీవితంలోనూ ప్రతీ కీలక సమయంలోనూ ఈ డప్పు కళాకారుల అవసరం ఉంటుందని రోజా గుర్తు చేశారు.. ఈ కళాకారుల పిల్లలు మంచి చదువు చదువుకునేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారని, పెద్ద చదువులు చదవడానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చారని రోజా అన్నారు.
ఇటీవల కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు. కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్ కు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీగా ఆడారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కూడా బరిలో దిగి కూత పెట్టారు.
ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోజా ఓ జట్టు తరపున.. సెల్వమణి మరో జట్టు తరపున కబడ్డీ ఆడారు. గతంలోనూ ఓసారి రోజా కబడ్డీ ఆడారు. తన నియోజకవర్గంలో టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లి కూతపెట్టారు. అప్పుడు కూడా రోజా కబడ్డీ కోర్టులో సందడి చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.