ఎన్నికల రాష్ట్రం యూపీలో కొత్త పొత్తు పొడుపు ఉదయించింది. సోషలిస్ట్ లోహియా ఆలోచనా విధానాలుండే సమాజ్ వాదీ పార్టీ, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టి, మిశ్రమ భావజాలాలున్న ఆమ్ ఆద్మీ పార్టీలు తొలిసారి కలవనున్నారు. ఎస్పీతో పొత్తు ఖరారైందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఎస్పీ.. ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకోగా ఇప్పుడు ఆప్ చేరిక ద్వారా అది చిన్నపాటి కూటమిగా మారనుంది. ఎస్పీ నుంచి విడిపోయిన శివపాల్ యాదవ్ కూడా మళ్లీ అఖిలేశ్ తో కలవనుండటం తెలిసిందే.
సమాజ్ వాదీతో ఆప్ పొత్తు ఖరారైందని, సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయం లోహియా ట్రస్ట్ భవన్ లో బుధవారం అఖిలేశ్ యాదవ్ ను కలిసిన అనంతరం సంజయ్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇద్దరు నేతలు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అఖిలేశ్ యాదవ్ తో భేటీ సంతృప్తికరంగా సాగిందని, పొత్తుకు రెండు పార్టీ నుంచి అంగీకారం కుదరిందని, ఎన్నికల పోరాటానికి అజెండా నిర్ధారణతోపాటు సీట్ల పంపకాలపైనా ఇవాళ చర్చలు జరిపామని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. జులైలో అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా కలిసినప్పుడు తొలిసారి ఆప్, ఎస్పీల పొత్తు అంశం చర్చకు వచ్చిందని, పలు దఫాల చర్చల అనంతరం కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఆప్ సర్కారు పాలిస్తోన్న ఢిల్లీలో యూపీ వలస కార్మికులు లక్షల సంఖ్యలో ఉండటం, యూపీ పరిధిలోకి వచ్చే నోయిడా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ద నగర్, మీరట్ తదితర జిల్లాల్లో ఆప్ విస్తృతంగా కార్యకాలాపాలు నిర్వహిస్తున్న దరిమిలా ఎస్పీతో పొత్తుకు ఎనలేని ప్రాధాన్య ఏర్పడింది. యూపీలోనే ఓటర్లుగా ఉంటూ, ఢిల్లీలో వసల జీవనం సాగిస్తోన్న లక్షల మంది ఆప్ పథకాల ద్వారా లబ్ది పొందుతోన్న దరిమిలా ఆ ఓట్లు ప్రభావం చూపుతాయని రెండు పార్టీలూ భావిస్తున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ.. పశ్చిమ యూపీ నుంచే సీట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రకటనకు ఇంకా కొద్ది నెలల సమయం ఉంటంతో ఏయే సీట్లను ఆప్ కు కేటాయించాలనే దానిపై అఖిలేశ్ నిర్ణయం తీసుకోనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఉండే ప్రాధాన్యం నేపథ్యంలో ఎస్పీతో ఆప్ పొత్తు పెట్టుకోబోంతోందనే ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే జయంత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. యూపీలో జట్ వర్గానికి చెందిన రైతుల్లో ఆర్ఎల్డీకి బలమైన పట్టు ఉండటం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జాట్ రైతులే ముందు వరసలో ఉండటం, ఇప్పుడు వారంతా బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఎస్పీ పంచన నిలవడం కీలకంగా మారింది. వీరికి తాజాగా ఆప్ కూడా తోడు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠరేపుతున్నది.
యూపీలో ఎస్పీ, ఆర్ఎల్డీ, ఆప్ కలిసి పోటీ చేయనుండటం ఖరారుకాగా, కాంగ్రెస్ పార్టీ ఒటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం అప్నాదళ్, జేడీయూ లాంటి మిత్రులతో కలిసి బరిలోకి దిగనుంది. మొత్తం 404 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో కేంద్రం నిర్మించిన భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.