ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వరుసగా భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు జరుపుతోన్న ప్రధాని మోదీ ఇవాళ బలరాంపూర్ లో ప్రతిష్టాత్మక సరయు కెనాల్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ.. దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాల సిబ్బందిని గుర్తుచేసుకున్నారు.
డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ సంతాపాన్ని తెలుపుతున్నానని, భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తుడికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు. ధైర్యవంతుడైన రావత్.. దేశ సాయుధ బలగాలను మరింత స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డారని, దానికి దేశమంతా సాక్షిగా నిలిచిందని ప్రధాని గుర్తుచేశారు.
ఒక సైనికుడు సైన్యంలో ఉన్నంత కాలం మాత్రమే సైనికుడిగా ఉండబోడని, అతని జీవితమంతా యోధుడిగానే ఉంటాడని, అతను ప్రతి క్షణం క్రమశిక్షణకు దేశ గౌరవానాకి అంకితమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సీడీఎస్ మరణంతో దేశం దు:ఖంలో ఉన్నప్పటికీ, అభివృద్ధిని ఆపలేమని, దేశ గమనమూ ఆగబోదని, ప్రజలతో కలసికట్టుగా ముందుకు కదులుతూ సవాళ్లను ఎదుర్కొంటామని ప్రధాని అన్నారు.
కేంద్రంలో, యూపీలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం వల్లే అభివృద్ధి వేగవంతమైందని, అయితే బీజేపీ చేపట్టిన పనులు, ప్రాజెక్టులను తమవిగా కొందరు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమంటూ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను పరోక్షంగా విమర్శించారు మోదీ. సరయు కెనాల్ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాల కాలయాపన వల్ల అదనపు ఖర్చే రూ.100కోట్లు దాటిందని మండిపడ్డారు.

సరయు కెనాల్ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుంది. 6వేల పైచిలుకు గ్రామాల్లోని 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. తూర్పు యూపీలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహంగా, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఈ ప్రాజెక్టు అతి ముఖ్యమైనదని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం మౌర్య తదితరులు పాల్గొన్నారు.