కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాల్లో ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ (ఒప్పంద వ్యవసాయం - Contract Farming)కి చెందినది. దీని వల్ల తమ భూములు తమకు కాకుండా పోతాయని, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. కానీ వాస్తవంలో అలా జరగదనీ, అంతలా భయపడాల్సిన అవసరం లేదని గుజరాత్... బనస్కాంత జిల్లాలోని కుంభాల్మీర్ గ్రామ రైతు చెబుతున్నారు. చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు కూడా. బంగాళా దుంపల్ని సాగు చేస్తున్న ఈ రైతు... ఒప్పంద వ్యవసాయం ద్వారా... సంవత్సరానికి క్రమం తప్పకుండా రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు.
బనస్కాంతలో చాలా మంది రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు పంట వేస్తే నష్టం వస్తుందేమో అనే ఆలోచనే లేదు. పంటకు సరైన మద్దతు ధర లభిస్తుందో లేదో అనే చింతే లేదు. పండ దిగుబడి చాలా ఎక్కువగా వచ్చినా సరే... కాలు మీద కాలేసుకొని ధీమాగా ఉంటున్నారు. దీనంతటికీ కారణం వీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తుండటమే. గణేష్ భాయ్ పటేల్ కి 35 ఎకరాల పొలం ఉంది. అందులో ఒప్పంద వ్యవసాయంలో భాగంగా ఆలూ పంటను పండిస్తున్నారు. ఇందుకోసం ఆయన హైఫెన్ కంపెనీ (Hyphen Company)తో డీల్ కుదుర్చుకున్నారు. గత 8 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డీల్ కొత్తగా రాసుకుంటున్నారు. దాని ప్రకారం ఆయనకు ఆ కంపెనీ... ఏటా రూ.25 లక్షలు ఇస్తోంది.
గణేష్ భాయ్ పటేల్... ప్రతి సంవత్సరం డీల్ కుదుర్చుకున్నాక... ఆయనకు ఏం కావాలో అన్నీ కంపెనీయే సమకూర్చుతుంది. అంటే విత్తనాలు, పురుగుమందులు ఇలా అన్నీ కంపెనీయే ఇస్తుంది. ఎక్కువ ఉత్పత్తి రాబట్టేందుకు కావాల్సన పరికరాలు, యంత్రాలూ అన్నీ సమకూర్చుతుంది. అన్నింటికంటే మంచి విషయమేంటంటే... ఈ రైతులు పంట దిగుబడి వచ్చాక... దాన్ని అమ్మడానికి మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరమే రావట్లేదు. కంపెనీ వ్యక్తులే పొలం దగ్గరకు వచ్చి... మొత్తం ఉత్పత్తిని తీసుకుంటున్నారు. ఇలా దిగుబడి తీసుకెళ్లిన 15 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బు జమ చేస్తున్నారు.
మా కంపెనీ ఒక్క గనేష్ భాయ్తోనే కాదు... ఈ జిల్లాలోని మొత్తం 1400 మంది రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయిస్తోంది. గుజరాత్ మొత్తం మీద 3000 మంది మా కంపెనీతో డీల్స్ కుదుర్చుకున్నారు. మా కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల సంవత్సరానికి 2.5 కోట్ల ఆలూ చిప్స్ ఉత్పత్తి అవుతున్నాయి. మేం తరచూ రైతులతో మాట్లాడుతూ... ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడైనా ఏ రైతుకైనా సమస్య వస్తే... వెంటనే మా నిపుణులు వెళ్లి... తగిన సలహాలు ఇచ్చి... ఉత్పత్తిని పెంచుతారు. అందువల్ల రైతులకు సమస్య లేదు అని హైఫెన్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ దినేష్ మాలీ చెబుతున్నారు.
సంవత్సరం తర్వాత పాత కాంట్రాక్ట్ రద్దవుతుంది. మళ్లీ కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. వెంటనే పంట వేస్తారు. దీని వల్ల రైతులకు మద్దతు ధర రావట్లేదనే సమస్యే కనిపించట్లేదు. అంతకు మించిన ధర, భారీ లాభాలు పొందుతున్నారు. దళారులు, మార్కెట్లలో వారిని బతిమలాడాల్సిన పనేలేదు. పంట పాడయ్యే పరిస్థితులు, రోడ్డుపై పంటను పారేసుకునే రోజులు ఇక్కడ ఎప్పుడో పోయాయి. ఏటా రూ.25 లక్షలు రావడం గ్యారెంటీ కావడంతో... ఇలాంటి ఎంతో మంది రైతులు ఇక్కడ కాంట్రాక్ ఫార్మింగ్ తో లాభాలు చూస్తున్నారు.
బనస్కాంత జిల్లాలోని చాలా మల్టీ లెవెల్ కంపెనీలు... ఈ కాంట్రాక్ ఫార్మింగ్ తో లాభాలు పొందుతున్నాయి. ఇక్కడి బంగాళ దుంపలు చాలా నాణ్యమైనవిగా ఉండేలా కంపెనీలు నిపుణులతో పండిస్తున్నాయి. తద్వారా భారీ దిగుబడి వస్తోంది. వాటిని ఆలూ చిప్స్ గా తయారుచేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చిప్స్ బిజినెస్ జరుగుతోంది. మంచి దిగుబడి, మంచి నాణ్యత ఉండటంతో... ఈ చిప్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇటు రైతులకు, అటు కంపెనీలకూ కలిసొస్తోంది.