కేవలం చాయ్ అమ్ముకుంటూ కుటుంబాలను పోషించే ధీరులు, ధీరవనితలు దాదాపు అన్ని ఊళ్లలో కనిపిస్తారు మనకు. రోడ్డు పక్కన టీ అమ్మకంతో మొదలై రెస్టారెంట్లకు ఓనర్లైనవాళ్లూ తెలుసు. రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకుని దేశానికి ప్రధాని అయిన మోడీ కథ ఉండనే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ కథలన్నీ పోస్ట్ ఇండిపెండెన్స్ లో పుట్టినవాళ్లవే. ఆధునికతకు మారుపేరైన మిలీనియల్స్ లో కప్పులు కడిగి పైకొచ్చినవాళ్లు చాలా అరుదు. అలా వచ్చినవాళ్లలో పాతికేళ్ల ప్రఫుల్ బిలోర్ జాతిరత్నంలాంటోడు..
ప్రఫుల్ బిలోర్ సొంతూరు మధ్యప్రదేశ్ లోని ధర్ జిల్లా. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఐఐఎంలో సీటు రాకపోవడంతో కలత చెందిన అతను బ్రేక్ కోసం దేశయాత్రకు బయలుదేరాడు. పలు నగరాలు తిరుగుతూ చివరికి అహ్మదాబాద్ లో ఆగాడు. అక్కడే ఓ రెస్టారెంట్లో హెల్పర్ గా చేరాడు. రోజులు గడుస్తుండగా మళ్లీ జీవితంపై నమ్మకం పెరిగింది. సొంతగా ఏదైనా చేసేద్దామని అనుకున్నాడు. అయితే..
అహ్మదాబాద్ లో తాను పనిచేసే రెస్టారెంట్ కు దగ్గర్లో రోడ్డు పక్కనే ఓ టీ కొట్టు ఉండేదట. ఆ షాపు వ్యక్తితో సరదా సంభాషణ తర్వాత ప్రఫుల్ కూడా చాయ్ అమ్మాలని డిసైడయ్యాడు. తండ్రి దగ్గర్నుంచి ఓ 8వేలు అప్పు తీసుకుని ఎంబీఏ చాయ్ వాలా తొలి ఔట్ లెట్ పెట్టాడు. డిగ్రీలు చదివి చాయ్ అమ్ముకోవడం, పైపెచ్చు ఎంబీఏ చాయ్ వాలా అని పేరు పెట్టుకోవడంతో మొదట్లో ప్రఫుల్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విచిత్రం కాకుంటే, అతను సీటు సాధించలేకపోయిన ఐఎంఎంలోనే ప్రఫుల్ మోటివేషనల్ క్లాసులు ఇస్తున్నాడిప్పుడు. ప్రఖ్యాత హార్డర్డ్ లోనూ ఓ లెక్చర్ ఇచ్చాడు.
చాయ్ అమ్మడాన్ని ప్రఫుల్.. ఎంబీఏ చాయ్ వాలా దుకాణంలో చాయ్ తాగడాన్ని కస్టమర్లు సెలబ్రేషన్ల ఫీలవుతుంటారు. వాలంటైన్స్ డే రోజున సింగిల్స్ కోసం ఉచితంగా చాయ్ సర్వ్ చేయడం లాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వర్కౌట్ అయ్యాయి. ఎంబీఏ చాయ్ వాలా ఔట్ లెట్స్ లో చాయ్ తోపాటు మగ్గీ, బన్ మస్కా; బ్రెడ్ బట్టర్, శాండ్ విచ్, ఫ్రెంచ్ ఫ్రై, స్నాక్ ఇలా 35 రకాల వెరైటీలు సర్వ్ చేస్తుంటారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటోన్న ప్రఫుల్.. ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాడు. వివరాల కోసం MBA Chai wala వెబ్ సైట్ చూడొచ్చు.