వీరప్పన్ ను పట్టుకునేందుకు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో 1991 నుంచి ప్రయత్నాలు ఆరంభించి, విజయకుమార్ నేతృత్వంలో 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ఆపరేషన్ ముగిసింది. దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖరీదైన ఆపరేషన్ గా నిలిచింది.
వీరప్పన్ మరణం తర్వాత భార్య ముత్తులక్ష్మి సైతం కొన్నాళ్లు జైలు జీవితం, సుదీర్ఘకాలంపాటు పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. పిల్లలు ప్రభ, విద్యారాణిలు వాళ్ల మేనత్త మాల సంరక్షణలో పెరిగారు. ప్రభ ప్రచారానికి దూరంగా ఉంటుండగా, విద్యారాణి రాజకీయాల్లోకి అడుగపెట్టారు. తమిళనాడు బీజేపీలో ప్రస్తుతం ఆమె యువనేతగా రాణిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి తండ్రిని చూడలేదని, చనిపోయాక కాసేపు మృతదేహాన్ని చూశానని విద్యారాణి చెబుతారు. తండ్రి ఎలాంటివాడైనా సమాజం మాత్రం తనను శత్రువుగానో, ప్రత్యర్థిగానో చూడలేదని, మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీరప్పన్ మంచితనం గురించి కూడా తాను చాలా విన్నానని చెప్పారామె. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని వీరప్పన్ కూతురు విద్యారాణి అంటారు.