తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికను డూ ఆర్ డై గా భావిస్తోంది. అందుకే అధినేత చంద్రబాబు స్వయంగా తిరుపతిలో మకాం వేసి.. అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే హైదరాబాద్ ను తాను కట్టానని సెల్ప్ డబ్బా చెప్పడానికే పరిమితం కాకుండా.. ఎన్నిక ప్రచారాన్ని కొత్త కొత్త పద్ధతుల్లో నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పాదయాత్రలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో రూటు మార్చారు. అలా పాదయాత్రగా వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఉన్న ప్రజలు, రోడ్డు పక్కన ఉన్న షాపుల దగ్గరకు వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు చంద్రాబు. ఓ ఎండు మిర్చీ వ్యాపారిని ఆప్యాయంగా పలకరించిన ఆయన.. అక్కడి రేట్లపై ఆరా తీశారు. వ్యాపారం ఎలా జరుగుతోందని? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ కుశల ప్రశ్నలు వేశారు.
ఇటీవల మరణించిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కౌతుగుంట గురవయ్య నాయుడు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు కలిశారు. గురవయ్య ప్రజాసేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాసేపు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన.. పార్టీ పరంగా అన్నివిధాలా ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో చిన్న పాపకు స్వయంగా ఆయన చేతులతో ఐస్ క్రీమ్ తినిపించారు చంద్రబాబు నాయుడు.
గతంలో చంద్రబాబు పర్యటనలు, ప్రచారాలు అంటే కేవలం భారీ ప్రసంగాలు, చెప్పిన మాటలే చెప్పి విసిరిగిస్తారనే ముద్ర ఉండేది. అందుకే ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు. స్థానిక నేతలను స్వయంగా కలుస్తూ వారి బాగోగులపై ఆరా తీస్తూ అందర్నీ కలుపుకొని ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ మార్పు మంచిది అవుతుందో లేదో చూడలి.
టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున ప్రచారం నిర్వహించిన ఆయన.. రావూరులో రోడ్ షో నిర్వహించారు. పనబాక లక్ష్మి 4 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒకరికి కూడా రాజకీయ అనుభవం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనే తాను కష్టపడి పనిచేశానని, బడుగు బలహీన వర్గాల కోసం పనబాక పనిచేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్‌రెడ్డి జమానాలో బీసీల ప్రాధాన్యత నేతి బీరకాయ చందమే అంటూ విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదన్నారు. నవరత్నాలు కాదు.. నవమోసాలు చేశారు. నవగ్రహాల చుట్టూ తిరిగిన వైసీపీ నేతల పాపాలు పోవు అని మండిపడ్డడారు. షెడ్యూల్డ్ కులాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎస్సీలకు విదేశీ విద్య, ఇన్నోవా కార్లు అందించిన ఘనత టీడీపీదే అన్నారు. వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే ఏం చేశారని ప్రజలు నిలదీయాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది గోరంత అయితే ఇప్పటికే ఏపీ ప్రజల నుంచి దోచింది కొండత ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం లేదు.. బీసీ సబ్‌ప్లాన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జగన్‌రెడ్డి వల్ల పెట్రోల్ ధర సెంచరీ కొట్టాయన్నారు. పేదల జేబులు గుల్ల చేసిన పెద్దమనిషి జగన్‌రెడ్డి అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు చంద్రబాబు మరోసారి సవాల్ విసిరారు. టీడీపీ, వైసీపీ పాలనపై చర్చించడానికి అధికార పార్టీ నేతలు ఎవరికైనా ఉందా? అని చంద్రబాబు నిలదీశారు. మద్యపాన నిషేధం అనేది పచ్చి మోసమన్నారు. లాక్డౌన్లో కూడా బ్రాందీషాపులు తెరుస్తారాని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చదువు చెప్పే టీచర్లను సారాకొట్ల దగ్గర కాపాలా పెడతారా? అంటూ చంద్రబాబు నిలదీశారు.
జగన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇలాగే కొనసాగితే జగన్ ను చరిత్ర క్షమించదన్నారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ తేలేరు. కాబట్టి.. ఆ పేరుతో మద్యం బ్రాండ్ తెచ్చారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం నష్టపోతోంది.. ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. అయినా రాజ్యాంగ ఉల్లంఘన చేసి అప్పులు తేవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే.. ఇప్పుడు ఇసుక మాత్రం చెన్నై, బెంగళూరులో దొరుకుతోందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు చనిపోయిన సంఘటనలు సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని కోరారు.