వైఎస్సార్ జయంతి(జూలై 8న) వైఎస్ షర్మిల.. తన పార్టీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తెస్తామనే నినాదంతో షర్మిల పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షల పేరుతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెకు పార్టీలో మాత్రం ఊహించని షాక్‌లు తగులుతున్నాయి.
జూలై నెలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్ఆర్టీపీకి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి.. వైఎస్ఆర్టీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందేఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు.
మరోవైపు షర్మిలకు అండగా.. ఆమె తల్లి విజయమ్మ నిలుస్తున్నారు. షర్మిల పార్టీకి సంబంధించిన ప్రతి విషయంలో ఆమెతో కలిసి సాగుతున్నారు. తన కూతురుని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. ఇటీవల వైఎస్సార్ 12వ వర్దంతిని సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభ ద్వారా విజయమ్మ ఆమెకు అండగా నిలిచే ప్రయత్నం చేశారనే టాక్ వినిపించింది.
అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని అంటున్న షర్మిల నినాదానికి ఇక్కడ ప్రజలు ఆకర్షితులు అవుతున్నట్టు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకకులు అభిప్రాయపడుతున్నారు. తనకు తానుగా ప్రజల్లోకి వెళ్లడంలో షర్మిల ముందున్నా.. వారిని ఆకర్షించడంలో మాత్రం ఆమె ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదేమో అనే వాదన వినిపిస్తోంది.