తిరుపతి ఉప ఎన్నికలో ఓ వైపు మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్షాలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే కీలక నేతలంతా అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు ఢీ అంటే ఢీ అంటున్నారు. అధికార వైసీపీ తరపున గురుమూర్తి, ప్రధాన ప్రతిపక్షం తరపున పనబాక లక్ష్మి, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్న ప్రభ బరిలో ఉన్నారు. మూడు పార్టీలు ఎవరికి వారు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. పోటా పోటీ వ్యూహాలు రచిస్తూ.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు కీలక నేతలంతా.
ప్రచారంలో ఎలా ఉన్నా.. ఓ విషయంలో ప్రత్యర్థి పార్టీల కంటే బీజేపీ ఓ అడుగు ముందుకు వేసింది. తిరుపతి ఉపఎన్నిక కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించింది బీజేపీ. ఆ మేనిఫెస్టోను బీజేపీ, జనసేన నాయకులు సంయుక్తంగా విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, కన్నా లక్ష్మీనారాయణ ఇతరలు ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ నిధులను ప్రభుత్వ పరం చేసే ప్రయత్నాలు జరిగాయని, టీటీడీ ఆస్తులను వేలం వేయాలని గతంలో ప్రణాళికలు రచించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. తిరుపతిని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దటానికి బీజేపీ ప్రయత్నించిందని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ తిరుపతిని కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగా చూస్తున్నాయని మండిపడ్డారు.
రాయలసీమ ప్రాంత ప్రజలకు గతంలో ఎంతోమంది ఎన్నో హామీలిచ్చారని, ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేన-బీజేపీ తోనే ఆ మార్పు సాధ్యమన్నారు. అందుకే ఉమ్మడిగా తిరుపతి రూపురేఖలు మార్చే అద్భుతమైన మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని మనోహర్ వెల్లడించారు.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు ఇవే: ప్రతీ రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు, రెండు లక్షల రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు బీజేపీ నేతలు, పాల ఉత్పత్తి దారులకు, గొర్రెల పెంపకం దారులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. మత్య్స కారుల మధ్య ఘర్షణలు లేకుండా పులికాట్ సరస్సులో సరిహద్దుల రీ సర్వే చేయిస్తామన్నారు. ప్రతీ మండలంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని బీజేపీ నేతలు హామీలు ఇచ్చారు. పై మేపిఫెస్టోలు ఉన్న అంశాలు అవే.
తిరుపతి నుంచే రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించే కార్యక్రమం చేపడతామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి టీటీడీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిరోధించే చర్యలు తీసుకుంటామన్నారు. మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుపై ఫోకస్ చేస్తామని హామీ ఇచ్చారు. 48 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుతో పాటు,
ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా కోసం జల జీవన పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో వివరించారు.