బిగ్ బాస్ ఫేం హేమ.. విదాస్పద వ్యాఖ్యలతో అప్పుడప్పుడూ వైరల్ అవుతూ ఉంటారు. సినిమాల్లో కామెడి పంచ్ లతో నవ్వులు పూయించే ఆమె.. అదే క్రేజ్ తో తరువాత రాజకీయాల్లో అడుగు పెట్టారు. మొదట టీడీపీ, తరువాత వైసీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. అయితే చేరిన తొలి రోజే ఆమె పార్టీ నేతలకు సినిమా చూపించేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆమె తన స్పీచ్ లతో పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు అభ్యర్థి రత్న ప్రభ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. కానీ సభకు వచ్చిన జనంలో మాట్రం ఆమె స్పీచ్ నవ్వులు పూయించింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభ వేదికగా సోమవారం ఆమె బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నపభ తరఫున ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు కూడా.. కానీ తొలి ప్రచారంలోనే పార్టీ పెద్దలకు చుక్కలు చూపించేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా సరిగ్గా పలకక పోవడం, తర్వాత దాన్ని కవర్ చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిలో నవ్వులు పూయించాయి.
సాధారణ ఓటరుకి కూడా తిరుపతిలో జరుగుతున్నది లోక్ సభ ఉప ఎన్నిక అని తెలిసే ఉంటుంది. కానీ తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికా.. లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా హేమకు క్లారిటీ లేకుండా పోయింది. ఆమె అక్కడితోనే ఆగలేదు.. బీజేపీ అభ్యర్థి పేరు కూడా పలకడానికి హేమ ఇబ్బందిపడ్డారు. దీంతో ఆమె పక్కన ఉన్న వారు అభ్యర్థి పేరు ‘రత్నప్రభ’ అని చెప్పడంతో ఉన్నట్లుండి హేమ సీరియస్ అయ్యారు. పార్టీలో చేరి రెండు నిమిషాలు కాకముందే.. బీజేపీ నేతలకు ఓ రేంజ్లో షాకిచ్చారు. నాకు అన్నీ తెలుసు.. మీరేమీ చెప్పొద్దంటూ క్లాస్ పీకారు.
పార్టీ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తనకు బాగా తెలుసు అన్నారు. తాను అన్నీ నేర్చుకొనే వచ్చాను అన్నారు. తనకు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో ఎవరైనా మాట్లాడిత మీడియా వాళ్లు ఇష్టమొచ్చినట్టు రాస్తారని.. ప్లీజ్, తనకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా! తానే మొత్తం చెబుతాను అన్నారు. తిరుపతి ఓటర్లు రత్నప్రభకు భారీగా ఓట్లు వేసి గెలిపించి.. అసెంబ్లీకి పంపించాలని కోరుతున్నాను అన్నారు. దీంతో పక్కనే ఉన్న అభ్యర్థి రత్న ప్రభ షాక్ కు గురి అవ్వగా.. సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
మొదట రత్న ప్రభ పేరు సరిగ్గా చెప్పకపోవడం.. తరువాత ఎంపీ స్థానానికి ప్రచారం చేయడానికి వచ్చి.. అసెంబ్లీకి పంపాలని హేమ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు మాత్రం హేమ స్పీచ్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సీరియస్‌గా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో హేమా స్పీచ్‌తో నవ్వులు విరబూశాయి.
అంతే కాదు.. ఆమె బీజేపీ నేతలతో కలిసి సభలో పాల్గొన్నా.. స్పీచ్ మొత్తం వకీల్ సాబ్ పై పొగడ్తలకే అధిక సమయం కేటాయించారు. అంటే ఆమె జనసేనలో జాయిన్ అయ్యారా? బీజేపీ లో జాయిన్ అయ్యారా అనే డౌట్ కూడా అందరికీ పెరిగింది. నాన్ స్టాప్ గా పవన్ కళ్యాణ్ పై పొగడ్తలు కురిపించారు. అయితే పక్కనే ఉన్న బీజేపీ నేతలు మోదీని పోగడాలని గుర్తు చేయడంతో.. మళ్లీ సవరించుకుని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే సమాశం అయ్యాక కూడా ఆమె బీజేపీ నేతలపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇలా స్పూన్ ఫీడ్ ఇస్తే తనకు కష్టం అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారి నవ్వులు పూయిస్తోంది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నటి హేమ కామెడి టైమింగ్ సూపర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.