West Bengal Assembly Elections: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బెంగాల్ తమ వశం అయిపోవాలని ఫిక్స్ అయిపోయింది కమలదళం. అందుకే బెంగాల్ దంగల్ చేపట్టి... దండ యాత్ర మొదలుపెట్టింది. కొన్ని సర్వేల అంచనాలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉండగా... ఎలాగైనా దీదీకి షాక్ ఇవ్వాలనుకుంటున్న బీజేపీ... రేపు (మార్చి 7) కోల్‌కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో భారీ ర్యాలీకి శ్రీకారం చుడుతోండి. భారీ అంటే... మామూలు భారీ కాదు... అతి భారీ అనుకోవచ్చు. ఎందుకంటే... 7 లక్షల మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొంటారు. 1500 సీసీటీవీలను అమర్చారు. పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రికలు (పాంప్లెట్లు) పంచుతున్నారు.
బీజేపీ ఇలా దూసుకురావడం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి పెను సవాలుగానే మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (ఎన్డీయే) టీమ్ 2 ఎంపీ సీట్ల నుంచి 18 ఎంపీ సీట్లకు ఎదిగింది. అంటే అదనంగా 16 సీట్లు గెలిచింది. అదే సమయంలో తృణమూల్ అండ్ కో టీమ్ 34 స్థానాల్లో 12 కోల్పోయి.... 22 స్థానాలతో సరిపెట్టుకుంది. అంతే... ఆ క్షణమే బీజేపీ... ఇక బెంగాల్ తమ వశం అయినట్లే అని ఫిక్స్ అయిపోయింది.
మరోవైపు శ్రీరామ నినాదంతో బీజేపీ యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇదే సమయంలో ఈ శ్రీరామ నినాదం వింటే చాలు దీదీకి ఎక్కడలేని బీపీ వచ్చేస్తోంది. నిజానికి శ్రీరాముడంటే మమతకు శత్రుత్వమేమీ లేదు. కానీ... శ్రీరాముణ్ని బీజేపీ అస్త్రంలా ఫీలవుతున్న దీదీ... ఎక్కడా శ్రీరామ నినాదం వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. వీలైనంత ఎక్కువగా శ్రీరామ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ... నువ్వా నేనా అని ఢీ కొడుతోంది.