పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసిన కేంద్రం.. ఆ కోతల వల్ల ఏర్పడిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటు భర్తీకి సిద్ధమవుతున్నది. మార్కెట్ రుణాల ద్వారా ఈ లోటు భర్తీ చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్థంలో కొత్తగా రూ.1లక్ష కోట్ల అప్పులు తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వ చర్యతో దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ మధ్యనే రెపో రేటును ఒక్కసారిగా 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచేసింది. దీంతో పదేళ్ల కాలపరిమితి ఉండే ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేటు 7 నుంచి 7.39 శాతానికి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.14.3 లక్షల కోట్లు సమీకరించబోతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్లోనే ప్రకటించారు. అయితే పెట్రో సుంకం తగ్గింపు కారణంగా ఇప్పుడు ఆ ఖాతా మరో రూ.లక్ష కోట్లు పెరగనుంది. దీంతో రుణ పత్రాల మార్కెట్ మరింత వేడెక్కి.. దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కొనసాగుతోన్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా, రుణ సేకరణ మరో రూ.లక్ష కోట్లు పెరిగితే ఇది జీడీపీలో 6.9 శాతానికి చేరుతుందని ఆర్థికవేత్తల అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంత చేసినా దేశంలో ద్రవ్యోల్బణం మాత్రం ప్రభుత్వాన్ని ఇంకా భయపెడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్రో భగభగలకుతోడు ఆహార ధాన్యాలు, వంట నూనెల మంట సామాన్యులకు మోయలేని భారమైంది. మరోవైపు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగల నుంచి ప్రజల్ని కొంతైనా కాపాడేందుకు ప్రభుత్వం త్వరలో మరిన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లతో ఆహార, ఎరువులు, వంట గ్యాస్ సబ్సిడీలు మరింత పెంచాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)