కాశీలో ప్రతి రాయి శివుడే.. కాశీకి సేవ చేయడం అనంతం.. కాశీ.. భారత సంస్కృతిక రాజధాని అని మోదీ అన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉండాలన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అన్నారు. భారత్‌లో భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమైందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం విశ్వనాథ ఆలయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు.
నేటి భారత్.. కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్లీ వందేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిందన్నారు. దేశం కోసం మీరంతా మూడు సంకల్పాలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేశాలని మోదీ అన్నారు. స్వచ్ఛత జీవన శైలి కావాలన్నారు. దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వచ్ఛత చాలా కీలకం అన్నారు. ఆత్మ నిర్భర భారత్ చాలా అవసరం అన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా మోదీ కలియతిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలుకరించి, ముచ్చటించారు. కార్మికులపై పూలు చల్లిన అనంతరం అందరితో కలిసి మోదీ ఫోటో దిగారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ పూలు చల్లిన సమయంలో పారిశుద్ధ్య కార్మికులు హర హర మహదేవ అని నినదించారు.
ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ఇవాళ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగా నది నుంచి నీటితో ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. నది నుంచి కొంత దూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకూంటూ స్వామివారి సన్నిధికి వెళ్లారు. ఇక ఆలయ పరిసరాల్లో డమరుక స్వాగతం ఆకట్టుకున్నది.
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ వందేళ్ల క్రితం వారణాసి వచ్చారని, అక్కడ ఇరుకు వీదులు, రోడ్లు, అపరిశుభ్ర వాతావరణం చూసి ఎంతో ఆవేదన చెందారని గుర్తుచేస్తూ, గాంధీజీ పేరుతో చాలా మంది అధికారంలోకి వచ్చినా భవ్య కాశీ నిర్మాణంతో బీజేపీ హయాంలోనే జరిగిందని అన్నారు.