ధరలను నియంత్రించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నది 1980లో జనతా పార్టీ పతనానికి కారణమైన నినాదం. 1980లో విపక్షంలో ఉన్న ఇందిరాగాంధీ.. ఉల్లి దండలను మెడలో వేసుకుని దేశవ్యాప్తంగా పర్యటించారు. అదే నినాదంతో ప్రజలను ఓట్లు అడిగారు. ఉల్లి ధరల అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన సందర్భం అదే తొలిసారి. అనేక కారణాలతో పాటు ఉల్లి ధరలు కూడా జనతా పార్టీ పతనానికి కారణమై మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది.
ఆ తరువాత చాలాసార్లు నేతలకు ఉల్లి ధర కన్నీళ్లు తెప్పించింది. 1998లో ఢిల్లీలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడానికి కారణం కూడా ఉల్లి ధరలే. అయితే నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఢిల్లీని దక్కించుకోలేకపోయింది. రాజస్థాన్ సీఎంగా బీజేపీ ముఖ్యనేత భైరాన్ సింగ్ షెకావత్ ఓటమికి కూడా ఉల్లి ధరలు ప్రధాన కారణం.
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం పెరిగిన ఉల్లి ధరలు ఆ రాష్ట్ర ఎన్నికలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధర కేజీ రూ. 70 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది. రాబోయే రోజుల్లో ఇది రూ. 120 నుంచి 150 వరకు వెళుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిధర రూ. 2000 వరకు పెరిగింది. గత సోమవారం నాసిక్‌లోని లాసల్గంజ్ మార్కెట్లో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ. 7100 వరకు వెళ్లింది. ఈ ధర ఇంకా పెరిగితే.. దేశంలోని రీటైల్ మార్కెట్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
అసలు ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. ఏదైనా వస్తువు ధర పెరగాలంటే దాని ఉత్పత్తి తగ్గడం లేదా డిమాండ్ పెరగడం వంటివి జరగాలి. ఉల్లి విషయంలో ఈ రెండూ జరుగుతున్నాయి. ఉల్లి ధరలు పెరగానికి కారణాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం మనం దేశంలో ఉల్లి ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. దేశంలో ఉల్లి సాగులో మహారాష్ట్రది సింహభాగం. నాసిక్, అహ్మద్‌నగర్, పుణె, దులే, షోలాపూర్ దేశంలోనే అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ తరువాత ఉల్లి సాగు చేసే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు నిలుస్తాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో సెప్టెంబర్‌లో అత్యధిక వర్షాలు కురవడంతో.. ఆ ప్రభావం ఉల్లి పంట, ఉల్లి ధరపై పడింది. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు పడ్డాయి. కర్ణాటకలోనూ వరదలు వచ్చాయి. వరుస వర్షాలు, వరదల కారణంగా చాలా రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో పాటు డిమాండ్ పెరగడం కూడా ఉల్లి ధరలు పెరగడానికి మరో కారణం. లాక్డౌన్ సమయంలో హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలు మూసివేయడంతో ఉల్లి డిమాండ్ పడిపోయింది.
అన్‌లాక్ 5 తరువాత ఇవన్నీ మళ్లీ తెరుచుకోవడంతో ఉల్లి డిమాండ్ భారీగా పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు ఉల్లి సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇది కూడా ధరలు పెరగడానికి మరో కారణం. అయితే ఉల్లి ధరలు ఎంతవరకు వెళతాయన్నది ఇప్పుడు అందరి మదిలో నలుగుతున్న ప్రశ్న. అయితే కిలో ఉల్లి ధర రూ. 120 వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉల్లి కొత్త పంట ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు ఉల్లి ధర పెద్దగా తగ్గకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కేరళలో కిలో ఉల్లి ధర రూ. 75 నుంచి రూ. 95 వరకు పలుకుతోంది. ఏపీ, తెలంగాణలో కిలో ఉల్లి ధర రూ. 100 వరకు పలుకుతోంది. తమిళనాడులో ఇదే పరిస్థితి ఉంది. అయితే అమ్మ ఫామ్ ఫ్రెష్‌లో ప్రభుత్వం రూ. 45కు కిలో ఉల్లి అమ్ముతోంది. ఉల్లి ధరను నియంత్రించేందుకు ఈజిప్ట్, ఇరాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఉల్లి ఎక్కువగా సాగు అయ్యే మహారాష్ట్రలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 80 వరకు ఉంది. ఫిబ్రవరిలో కొత్త పంట వచ్చేంతవరకు ఈ ఏడాది మొత్తం దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
బీహార్, జార్ఖండ్‌లో ప్రస్తుతం ఉల్లి ధర రూ. 60 నుంచి రూ. 70 వరకు పలుకుతోంది. ఎన్నికల సీజన్ వేళ బీహార్‌లో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. ఇది ఆ రాష్ట్రంలో ఎన్నికల అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిశాలో కిలో ఉల్లి ధర రూ. 70 నుంచి రూ. 75 వరకు పలుకుతోంది. అసోంలో కిలో ఉల్లి ధర రూ. 60-70 వరకు ఉంది.