వ్యాక్సిన్ కోసం అక్కడికి వెళ్లిన వాళ్లు అక్కడ కనిపిస్తున్న హడావుడి చూసి అవాక్కయ్యారు. తాము వెళ్లింది వ్యాక్సినేషన్ సెంటర్‌కో లేక ఏదైనా కళ్యాణ మండపానికో వాళ్లకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వ్యాక్సిన్ వేయడం లేదని, ఇవాళ ఒక పెళ్లి జరుగుతోందని చెప్పాడు. దీంతో.. వ్యాక్సిన్ కోసం అక్కడికి వెళ్లిన వారంతా కారాలుమిరియాలు నూరుతూ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని నరన్పుర నవదీప్ హాల్లో జరిగింది. నవదీప్ హాల్‌ను వ్యాక్సినేషన్ సెంటర్‌గా మార్చి కొన్ని రోజులుగా అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్‌గా మార్చక ముందు నవదీప్ హాల్లో ఫంక్షన్స్ జరిగేవి. అహ్మదాబాద్‌లో చెప్పుకోదగ్గ ఫంక్షన్ హాల్స్‌లో నవదీప్ హాల్ ఒకటి. అయితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో చాలాచోట్ల ఫంక్షన్ హాల్స్‌ను వ్యాక్సినేషన్ సెంటర్లుగా మార్చి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు.
కొన్ని చోట్ల ఓపెన్ గ్రౌండ్స్‌ను కోవిడ్ హాస్పిటల్స్‌గా మారుస్తున్నారు. కానీ.. నవదీప్ ఫంక్షన్ హాల్లో ఇందుకు రివర్స్‌లో ఓ ఘటన జరిగింది. అప్పటివరకూ వ్యాక్సినేషన్ సెంటర్‌గా ఉన్న నవదీప్ హాల్ శనివారం పెళ్లి శోభను సంతరించుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు మంగళం పాడారు. శనివారం వ్యాక్సిన్ కోసం అక్కడికి వెళ్లిన వారు పెళ్లి హడావుడి చూసి అవాక్కయ్యారు.
ఓ 68 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ కోసం శనివారం నవదీప్ హాల్‌కు వెళ్లగా, ఇవాళ వ్యాక్సిన్ ఇవ్వడం లేదని.. లోపల పెళ్లి జరుగుతుందని.. రేపు రావాలని బయట ఉన్న సెక్యురిటీ గార్డు సమాధానమిచ్చాడు. దీంతో.. ఈ వృద్ధుడు నానా ఇబ్బందులు పడ్డారు. తాను మళ్లీ రావాల్సి వస్తోందని, ఇది దారుణమని చెప్పారు. అయినా వ్యాక్సిన్ సెంటర్‌గా మార్చిన హాల్‌ను పెళ్లిళ్లకు అద్దెకు ఇవ్వడం ఏంటని ఆయన మండిపడ్డారు.