వేగంగా వ్యాప్తి చెందుతోన్న మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే 20 దేశాల్లోకి ప్రవేశించింది. శుక్రవారం నాటికి 200 కేసులు నిర్ధారణ అయినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈనెల 7వ తేదీన బ్రిటన్ లో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడగా, కొద్ది కాలంలోనే యూరప్, అమెరికా దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్‌కు చెందినదని, రోగులు కొన్ని వారాల్లోనే కోలుకుంటారని, ఇప్పటిదాకా మరణాలైతే సంభవించలేదన్న డబ్ల్యూహెచ్ఓ.. రాబోయే రోజులను అంచనా వేయలేమని పేర్కొంది.
కాగా, భారత్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది. అమెరికా, యూరప్‌లో మంకీపాక్స్ వైరస్ కేసులు బయటపడుతున్నాయని, భారత్‌లో ఇప్పటివరకూ వైరస్ కేసులు వెలుగుచూడలేదని ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ స్పష్టం చేశారు.
మంకీపాక్స్ సోకితే తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయని, ఒంటిపై దద్దుర్లు రెండు మూడు రోజుల తర్వాత కనిపిస్తాయని పేర్కొన్నారు. రోగితో దగ్గరగా ఉన్నవారికే ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మంకీపాక్స్‌పై మనం భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
భారత్ లో మంకీపాక్స్ భయాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా సమయంలో తీవ్రంగా ప్రభావితమైన ఈసారి ముందే మేల్కొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నగరంలోని కస్తుర్బా ఆసుపత్రిలో 28 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ సస్పెక్ట్ రోగులను ఈ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచేదుకు అంతా సిద్ధం చేశారు.
ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది.