యావత్ భారత దేశం ఉలికిపడేలా చేసింది హెలీకాఫ్టర్ ఘోర ప్రమాదం. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందారు. భారత రక్షణ దళాల్లో విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురికావడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఏకంగా సీడీఎస్ ప్రయాణిస్తున్నదే కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై వాయుసేన దర్యాప్తు మొదలుపెట్టింది.
Mi-17V5 హెలికాప్టర్.. రష్యాలో తయారైన Mi-8 హెలికాప్టర్ల మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెర్షన్. అవసరమైనప్పుడు దళాలను మోహరించడం, ఆయుధ రవాణా, అగ్నిమాపక సేవలు, పెట్రోలింగ్, సెర్చ్, రెస్క్యూ మిషన్లకు Mi-17V5 హెలికాప్టర్‌ను ఉపయోగిస్తారు. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లలో ఈ మోడల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన సైనిక రవాణా హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఎంఐ సిరీస్‌లో సురక్షితమైంది.. సీడీఎస్ రావత్ బృందం ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను సైనిక రవాణాకు వినియోగించే ఎంఐ-8 హెలికాప్టర్ల నుంచి అభివృద్ధి చేశారు. భారత్ మొత్తం 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్ ఎక్స్‌పోర్టుతో 2008లో ఒప్పందం చేసుకొంది. 2013 నాటికి డెలివరీలను పూర్తి చేసింది. మరో 71 హెలికాప్టర్లను వాయుసేన కోసం కొనుగోలు చేసేందుకు సంతకాలు జరిగాయి. చివరిసారిగా 2018లో కొన్ని హెలికాప్టర్లు భారత్‌కు చేరుకొన్నాయి.
ఎంఐ-8 ఎయిర్ ఫ్రేమ్ పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ఇది మధ్య శ్రేణి కిందకు వస్తుంది. అత్యాధునిక ఏవియానిక్స్ కలిగి ఉండటంతో ఏ వాతావరణంలో అయినా పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని నిర్మించారు. ఇది 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. పారా కమాండోలను జారవిడిచే సత్తా దీనికి ఉంది.
ఈ హెలికాప్టర్ Shturm-V క్షిపణులు, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్స్, AKM సబ్‌మెరైన్ గన్స్.. వంటి ఆయుధాలను కలిగి ఉంది. ఈ ఆన్‌బోర్డ్ ఆయుధాలు శత్రు సిబ్బంది, సాయుధ వాహనాలు, భూ-ఆధారిత లక్ష్యాలు, ఇతర లక్ష్యాలను ఛేదించగలవు. హెలికాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన భాగాలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంకును పేలుళ్ల నుంచి రక్షించడానికి పాలియురేతేన్ ఫోమ్‌తో నింపుతారు.
ముఖ్యుల కీలక పర్యటనలకు ఇదే.. అత్యంత సురక్షితమైందిగా mi సిరీస్ కు గుర్తింపు ఉంది. దీంతో భారత్‌లోని వీఐపీల పర్యటనలకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రధాని కూడా పర్యటనల కోసం దీనినే వినియోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇంధన ట్యాంక్ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి.
సెల్ఫ్‌సీల్డ్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణగా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ సప్రెసర్లు, జామర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇంత సెక్యూరిటీ ఉన్న హెలీకాఫ్టర్ ప్రమాదానికి గురి అవ్వడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వాయుసేన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.