ఉత్తరాఖండ్‌లోని పారిలో జన్మించిన ఆయన కుటుంబం నాలుగు తరాలుగా భారత ఆర్మీకి సేవ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తొలి త్రివిధ దళాధిపతిగా భారత ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అంతకుముందు వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.
2016 డిసెంబరు 31న 26వ భారత ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీ స్వీకారం చేశారు. అంతకన్నా ముందు భారత ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీవోఏఎస్)గా సేవలందించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీల్లో ఆయన చదువుకున్నారు. అనంతరం 1978లో ఇండియన్ మిలటరీ అకాడమీ ఆయన్ను ఆర్మీలోని ఎలెవెన్ గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఐదో బెటాలియన్‌కు పంపించింది. ఇక్కడ ఆయన అందించిన సేవలకుగానూ ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. హైఆల్టిట్యూడ్ యుద్ధాలు, చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో రావత్‌కు ఎంతో అనుభవం ఉంది.