ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలతో పాటు 75 ఏళ్ల వృద్ధురాలు, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఎనిమిదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. ఈ పిల్లలు ముగ్గురూ చావులో కూడా కలిసే ఉన్నారు. ముగ్గురూ ఒకరినొకరు గుండెలకు హత్తుకున్న స్థితిలో విగత జీవులై రెస్క్యూ టీంకు కనిపించారు. ఇలాంటి దృశ్యమే మరోచోట కనిపించింది. 28 ఏళ్ల వయసున్న తల్లి, ఆమె పదేళ్ల కొడుకూ మరణంలోనూ కలిసే ఉన్నారు.
2019లో కూడా ఇదే విధంగా.. తల్లి తన నెలల వయసున్న బిడ్డను చేతుల్లో ఉంచుకుని కన్నుమూసింది. కొండచరియలు మీద పడటంతో తల్లీబిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే వరదల కారణంగా కేరళ తన కడుపులో దాచుకున్న విషాదాలు ఎన్నో ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. కేరళలో మొత్తం ఇప్పటివరకూ 35 మంది వరదల కారణంగా మృతి చెందారు.