ఐతే వాస్తవానికి అవి మంచు కొండలు కాదు. పాలరాతి కర్మాగారాల నుంచి వెలువడే స్లర్రీ గుట్టలు గుట్లుగా పేరుకుపోయింది. అది తెల్లటి రంగులో ఉండడం వల్ల.. అచ్చం మంచు కొండల్లా దర్శమిస్తున్నాయి. హిమాలయ పర్వతాల్లా ఎంతో సుందరంగా కనువిందు చేస్తాయి. ఈ మార్బుల్ స్లర్రీ కొండలను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు.
11-12 ఏళ్ల క్రితం వరకు పాలరాతి స్లర్రీ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రి వేళల్లో స్లర్రీని రహస్యంగా రైతుల భూమి చుట్టూ లేక పచ్చిక బయళ్లలో పడేశారు. దీని కారణంగా భూమిలో సారం తగ్గి.. దిగుబడి బాగా తగ్గిపోయేది. పంటలు పాడయ్యాయి. పశువులు స్లర్రిలో చిక్కుకుని చనిపోతున్నాయి. మార్బుల్ వేస్ట్ డంపింగ్ యార్డు వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.
ఆ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా మార్బుల్ కట్టర్ అసోసియేషన్ సుమారు 50 బిఘాల విస్తీర్ణంలో మార్బుల్ స్లర్రితో కూడిన డంపింగ్ యార్డును నిర్మించింది. అక్కడ క్రమంగా మార్బుల్ స్లరీ పేరుకుపోయి తెల్లటి కొండల్లా ఏర్పడ్డాయి. నేలంతా పరుచుకొని.. హిమనీనదల్లా దర్శనమిస్తున్నాయి.
రాజ్‌సమంద్ ఏరియా డంపింగ్ యార్డ్‌లోని పాలరాతి స్లర్రీ గుట్టలు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పెళ్లి చేసుకోబోయే జంటలు ప్రి వెడ్డింగ్ షూట్ కోసం వస్తున్నాయి. టీవీ, సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి రాజ్‌సమంద్ నుంచే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా సహా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు.
ఏడాదిలో 100కు పైగా యువ జంటలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ల కోసం ఇక్కడికి వస్తున్నారని మోఖంపుర డంపింగ్ యార్డ్ సంరక్షకుడు భన్వర్ సింగ్ తెలిపారు. వారి నుంచి రూ.1100 చార్జీ వసూలు చేస్తారు. అంతేకాదు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా మొదలైంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని డంపింగ్ యార్డులోనే సౌకర్యాలు పెంచడంతోపాటు నిర్వహణకు వెచ్చిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ భారీ ఎత్తున షూటింగ్‌లు జరిపేలా నిర్మాణాలు చేపడుతున్నారు.