అసలే పులస చేపలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కేజీ పులస రూ.6వేల నుంచి రూ.7వేల దాకా పలుకుతోంది. ఈసారి చేపలు భారీగా రావడంతో... ఈ రూపోలీ లేదా పద్మ చేపకు దేవీ పక్ష మార్కెట్ లో కొరత లేకుండా పోయింది. ఐతే... పులస చేపల లాంటివే నకిలీ చేపలున్నాయి. మన దగ్గర వాటిని ఇలస చేపలంటారు. ఇప్పుడు బెంగాల్ లో ఈ నకిలీ చేపల సమస్య పట్టుకుంది.
పులస చేపల్ని గుర్తించేందుకు కొన్ని టెక్నిక్ లను చెప్పారు ఫిష్ ఇంపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ చంద్రదాస్. మిగతా నకిలీ చేపలతో పోల్చితే... పులస చేప మెడ భాగంలో కాస్త ముదురు రంగులో ఉంటుంది. తలపై భాగంలో పసుపు రంగు ఉంటుంది. ఈ పోలికలు ఉన్నవి మాత్రమే పులస లేదా పద్మ చేపలుగా గుర్తించాలని ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం పులస చేపల రేట్లు మరింత పెరిగాయట. అయినప్పటికీ అక్కడి ప్రజలు పులస చేపల్ని కొనుక్కుంటున్నారు. ఎందుకంటే... ఆ చేపలు అమ్మవారి అనుగ్రహంతోనే తమకు దక్కుతున్నాయని ప్రజలు భావిస్తారు. అందుకే వాటిని పద్మ చేపలు అంటారు. ప్రతి కుటుంబమూ కనీసం ఒక్క పులసైనా కొనుక్కొని... ఫ్రిజ్ లో దాస్తారు. చేప ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే అంత అదృష్టంగా భావిస్తారు. నచ్చినన్ని రోజులు ఫ్రిజ్ లో దాచి... తర్వాత వండుకుంటారు. అదో ఆనందం.