మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా 5 రాష్ట్రాలలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. భారతదేశంలో గత వారంలో దాదాపు 25,000 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల్లో ఒక వారంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.91 శాతంగా ఉంది. కేసుల్లో పెరుగుదల కనిపించినా మృతుల సంఖ్య తక్కువగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
* COVID-19 కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు ఇవే..
మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 1,494 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలో మాత్రమే 961 కేసులు ఉండగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 78,93,197కి చేరింది. మహారాష్ట్రలో వరుసగా నాలుగో రోజు ఆదివారం 1,000కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,357 కొత్త కరోనా కేసులు నమోదవగా, ఒకరు మృతి చెందారు. కేసుల్లో పెరుగుదల కనిపించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ వ్యాస్ అన్ని జిల్లాల అధికారులకు రాసిన లేఖలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమా థియేటర్లు, ఆడిటోరియంలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేశారు.
కర్ణాటక
కర్ణాటకలో ఆదివారం 301 తాజా COVID-19 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39,53,359కి పెరిగింది. ఒక్కరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 40,066కి చేరుకుంది. బెంగళూరు అర్బన్ జిల్లాలో 291, మైసూరులో మూడు, దక్షిణ కన్నడ జిల్లాలో రెండు కేసులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తమిళనాడు
అంతకుముందు ఆదివారం రాష్ట్రంలో 107 COVID-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై తమిళనాడు ఆరోగ్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. అన్ని జిల్లాల్లో నిబంధనలు కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడులో ఒమిక్రాన్ వేరియంట్ BA.4, BA.5 కేసులు బయటపడినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి MA సుబ్రమణియన్ తెలిపారు. నాలుగు శాంపిల్స్‌లో బీఏ.4, ఎనిమిది శాంపిల్స్‌లో బీఏ.5 గుర్తించినట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐదు రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
గత వారం ప్రారంభంలో కేంద్రం ఐదు రాష్ట్రాలకు కఠినమైన నిఘా ఉంచాలని సూచించింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ భారతదేశంలోని మొత్తం కేసుల్లో కొన్ని రాష్ట్రాల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోందని, స్థానికంగా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)