తెల్లారితే చాలు కరోనా కేసులు పెరుగుతున్నాయి... విద్యార్థులకు సోకుతున్న కరోనా అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ దేశాలతోపాటూ... ఇండియాలోనూ కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల మళ్లీ రాష్ట్రాల ప్రభుత్వాలకు టెన్షన్ పట్టుకుంది. చాలా రాష్ట్రాలు సేఫ్ డిస్టాన్స్ పాటించేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే పండుగలను నిషేధించాలనుకుంటున్నాయి. ఆదివారం సాయంత్రం మొదలై... సోమవారం సాయంత్రం ముగిసే హోలీ వేడుకలను కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి.
మన దేశంలో మార్చిలో కరోనా కేసులు బాగా పెరుగుతూ వచ్చాయి. సెకండ్ వేవ్ జోరుగా ఉంది. కొత్త స్ట్రెయిన్లు పిల్లలకు కూడా పాకేస్తున్నాయి. హోలీ జరుపుకుంటే... జనం పెద్ద ఎత్తున గుమి కూడా ప్రమాదం ఉంటుంది. రంగు నీళ్లు చల్లుకుంటారు. ఆ నీటిలో, గాలిలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
కరోనాతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. అక్కడి ముంబై, దాని చుట్టుపక్కల హోలీ వేడుకలను నిషేధించారు. ఇళ్లలో ఉండేవారు హోలీ రోజున పూజలు చేసుకోవచ్చు. ఢిల్లీతోపాటూ... పంజాబ్, హర్యానా రాజధాని చండీగర్లో కూడా హోలీ వేడుకలపై బ్యాన్ ఉంది. వ్యాక్సిన్లతో కరోనా వ్యాప్తి ఆగిపోయి ఉంటే... ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. కానీ వ్యాక్సిన్ వచ్చినా కేసులు పెరుగుతుంటే.. మళ్లీ రాష్ట్రాలు ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.