Coronavirus : ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వస్తున్న వారిలో కొంత మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. షాకింగ్ విషయమేంటంటే.. వారిలో కరోనా లక్షణాలు కనిపించట్లేదు. అంటే వాళ్ల ద్వారా ఇండియాలో మరింత మందికి కరోనా సోకే ప్రమాదం ఉన్నట్లే. పక్కన ఉన్న చైనాలో కరోనా కోరలు చాస్తోంది. జపాన్‌లోనూ పరిస్థితి బాగోలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ మాక్ డ్రిల్ (Mock drill) చెయ్యాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారంటే.. దేశవ్యాప్తంగా వైద్య అధికారులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అందరూ.. ఇందులో పాల్గొంటారు. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్‌గా చేస్తారు. అంటే.. కరోనా పేషెంట్లను ఆస్పత్రిలోకి తేవడం, వారికి మందులు ఇవ్వడం, ఆక్సిజన్ ఇవ్వడం, కరోనా జాగ్రత్తలు పాటించడం, ఐసోలేషన్, క్వారంటైన్ ఇలా కరోనాకి సంబంధించి చేయాల్సిన అన్నీ ఓసారి చేసి చూస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ మాక్ డ్రిల్ ఎలాంటిదంటే.. ముందస్తు రిహార్సల్ అనుకోవచ్చు. ఎందుకంటే.. చైనాలో వ్యాపిస్తున్న BF.7 వేరియంట్.. భారతీయులకు అంత ప్రాణాంతకమైనది కాకపోవచ్చు అంటున్నారు. కాకపోతే దీని వ్యాప్తి చైనాలో ఎక్కువగా ఉంది. ఇండియాలో కూడా దీని కేసులు ఓ నాలుగు వచ్చాయి కాబట్టి.. ఇది ఇండియాలో వ్యాపిస్తే.. ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి మాక్ డ్రిల్ ఓ ప్రిపరేషన్ లాగా ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ మాక్ డ్రిల్ ద్వారా లోటుపాట్లు తెలుస్తాయి. ముందస్తు ప్రిపరేషన్లో ఏయే లోపాలు ఉన్నాయో గ్రహిస్తారు. సపోజ్ ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవు అనిపిస్తే మరిన్ని తెప్పించుకుంటారు. ఐసీయూల కొరత ఉందని అనిపిస్తే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెడతారు. ఇలా ఎన్నో విషయాలపై ముందుగా రెడీ అవ్వొచ్చు. అందుకే కేంద్రం ఈ మాక్‌డ్రిల్‌కి పిలుపిచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
అసలే కరోనా పెరుగుతుంటే చైనా మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. జనవరి 8 నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. చైనాలో కరోనా వచ్చిన మూడేళ్లలో ఎప్పుడూ ఈ నిబంధనను ఎత్తివేయలేదు. తొలిసారి ఇలా చేస్తోంది. ప్రస్తుతం ఇలా వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ అమలులో ఉంది. ఐతే.. దీన్ని ఎత్తివేయడం కరోనా కేసులు పెరిగే అవకాశం ఏమీ లేదని నిపుణులు అంటున్నారు. పైగా చైనాకి వెళ్లే పర్యాటకులకు ఇది మేలు చేస్తుంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
చైనా బాటలోనే బ్రిటన్ కూడా సాగుతోంది. ఇకపై తమ కరోనా లెక్కలు చెప్పేది లేదని చైనా ప్రకటించడంతో.. బ్రిటన్ కూడా అదే చెప్పింది. తాము కూడా జనవరి నుంచి కరోనా డేటాను చెప్పేది లేదని తెలిపింది. తమ దేశ ప్రజలు కరోనాతో కలిసి బతికే దశకు వచ్చేశారనీ.. వ్యాక్సిన్లు, మందులూ ఉన్నాయి కాబట్టి.. ఇక ఈ డేటా బయటపెట్టాల్సిన పని లేదని బ్రిటన్ తెలిపింది. ఇకపై కరోనాను కూడా జలుబు, దగ్గు, జ్వరం లాంటి మామూలు ఇన్ఫెక్షన్ల లాగే చూస్తామని చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)