రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న రాష్ట ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని సీఎం విమర్శించారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని తెలంగాన సీఎం కేసీఆర్ అన్నారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా వున్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా వుంటుందని, వాటికి మద్దతిస్తామని ప్రకటించారు.
రాజధాని చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కొత్త నిబంధన తీసుకొచ్చి, రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోందని ఆరోపించిన కేసీఆర్.. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం మీటర్లు బిగించమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశామని పంజాబ్ రైతులకు గుర్తుచేశారు. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం మంచి పనులు చేస్తే కేంద్రానికి సహించదని, ఏదో విధంగా ఒత్తిడి తెస్తుందని మండిపడ్డారు.