తమిళనాడులో భారీ వర్షాలకు సర్వీసులవారు తప్ప ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, దుకాణ సముదాయాలు, మాళ్లు ఆల్మోస్ట్ మూతపడ్డాయి. కోర్టుల కార్యకలాపాలకు సైతం తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆరేళ్ల కిందట సంభవించిన మహాప్రళయం తరహాలోనే ఇప్పుడుకూడా చెన్నై నగరం నీటమునగడంపై మద్రాస్ హైకోర్టు మండిపడింది.
భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి చెన్నై నగరం నీట మునుగుతుండటంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదంటూ గ్రేటర్ చెన్నై నగర పాలక సంస్థపై కోర్టు మండిపడింది. 2015లో మహా ప్రళయాన్ని చూశారు కదా, ఆ వరదల నుంచి గుణపాఠం నేర్చుకోలేదా? ఆరేళ్లుగా కార్పొరేషన్ ఏం చేస్తున్నట్లు? అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఇంచైనా మార్పు లేదు కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడులో రోడ్లు తగినంత విశాలంగా ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలంటూ దాఖలైన పిల్ ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవుల ధర్మాసనం గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ను తిట్టిపోసింది. ‘ఒక సంవత్సరంలో సగం రోజులపాటు సరిగా నీళ్లు సరఫరా చేయకుండా ప్రజల్ని ఏడిపిస్తారు.. మరో సగం రోజులేమో వరద నీటిలో ప్రజలు మునిగి చచ్చేలా చేస్తారు.. ఇదే కదా మీ తీరు?’అని సీజే ధర్మాసం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వరద నీటిని తొలగించకుండా రోజుల తరబడి జనాన్ని ఇక్కట్లకు గురిచేస్తూ, అసలు వరదే నిలువ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చెన్నై కార్పొరేషన్ ఇదే తీరును కొనసాగిస్తే గనుక సుమోటోగా కేసును స్వీకరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా చెరువులు, నాలాల కబ్జాలపై కార్పొరేషన్ దృష్టిపెట్టాలని మొట్టికాయలు వేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇవాళ కూడా చెన్నై నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక కార్యక్రమాలను, అమ్మ క్యాంటీన్లలో ఆహార పంపిణీని పర్యవేక్షించారు. వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో ఇప్పటిదకా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు నీళ్లలో మునిగిపోయి భారీ ఆస్తినష్టం కూడా సంభవించింది. రాబోయే రెండురోజులూ భారీ వర్షాలు ఉండటంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు..