రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మినీ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు ప్రారంభించింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ మినీ వందేభారత్ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఇప్పటికే దేశంలో వందేభారత్ రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి. మరి, ఈ మినీ వందేభారత్ రైళ్ల విశిష్ఠత ఏంటి? కేంద్రం వీటిని ఎందుకు తీసుకు రావాలని భావిస్తోంది? వంటి వివరాలు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
అధునాతన ఫీచర్లు, సేవలతో కూడిన రైల్వే సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇదివరకే వందే భారత్ రైళ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రధాన నగరాలను కలుపుకుంటూ పోయే వందేభారత్ రైళ్లు.. ద్వితీయ శ్రేణి(సెకండ్ టైర్) నగరాలకు వ్యాపించలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
సుమారు 4-5 గంటల ప్రయాణ సమయం కలిగిన రెండు నగరాల మధ్య మినీ వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. ఉదాహరణకు ద్వితీయ శ్రేణి నగరాలైన అమృత్సర్- జమ్ము, కాన్పుర్- ఝాన్సీ, జలంధర్- లుధియానా, పుణె-నాగ్‌పుర్, కోయంబత్తూరు-మధురై స్టేషన్ల మధ్య మినీ వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్న వందేభారత్ రైళ్లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా, స్లీపర్ వెర్షన్ రైళ్లను రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై నడిపించనున్నారు. ఇప్పటివరకు 8 రూట్లలో వందేభారత్ రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ఎనిమిదో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.(ప్రతీకాత్మక చిత్రం)