BH-series: కొంత మంది తరచూ వేర్వేరు రాష్ట్రాలకు వాహనాలతో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లాక... వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన పని లేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం... కొత్త వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం తెచ్చింది. దీన్ని భారత్ సిరీస్ (BH - Series) అంటున్నారు. దీని కింద రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్ని ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా నడపవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు. రాష్ట్రం మారినప్పుడల్లా మళ్లీ రిజస్ట్రేషన్ అక్కర్లేదు.
ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం... ప్రభుత్వరంగంలోని ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు కూడా వర్తిస్తోంది. కాబట్టి వారంతా కొత్త వాహనాలకు ఇది అందుబాటులోకి వచ్చినట్లే. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 1988 నాటి మోటర్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం... ఓ వాహనమైనా రిజిస్ట్రేషన్ అయిన రాష్ట్రంలో హాయిగా తిరగవచ్చు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే... 12 నెలలకు మించి తిరగకూడదు. అలా తిరగాలంటే 12 నెలల లోపు అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునేవారు... ఆ వాహనం అసలు రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రంలో జరిగిందో... అక్కడి ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాలి. దాన్ని తీసుకెళ్లి... కొత్త రాష్ట్రంలో ఇచ్చి... అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కొత్త రాష్ట్రం... కొత్త రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇందుకోసం ప్రోరేటా ప్రకారం రోడ్ టాక్స్ వసూలు చేస్తుంది. దాన్ని ప్రస్తుత రాష్ట్రంలో రిఫండ్ కింద పొందవచ్చు. ఇందుకోసం ప్రస్తుత రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రస్తుత రాష్ట్రం ప్రోరేటా కింద రోడ్ ట్యాక్స్ రిఫండ్ ఇస్తుంది.
కొత్త భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లను రక్షణ రంగంలోని వారు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థల ఉద్యోగులు పొందవచ్చు. ఈ సంస్థల ఆఫీసులు 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంటే... వాటికి ఈ స్కీమ్ బాగా పనిచేస్తుంది.