ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణంపై ఆయన వీరాభమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో చివరి ఘడియలకు సంబంధించి ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న కథనాలను ఫ్యాన్స్ నమ్మడంలేదు. పునీత్ చావు వెనుక ఏదో అంతుచిక్కని కుట్ర ఉందని, డాక్టర్ల ఉద్దేశపూర్వక తప్పిదాల వల్లే విషాదం జరిగిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తమ అనుమానాలు నివృత్తి అయ్యేలా నేరుగా పునీత్ ఫ్యామిలీ డాక్టరైన డాక్టర్ రమణారావుతో అమీతుమీకి సైతం ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ఇంకొందరైతే, రాజ్ కుమార్ మృతికి డాక్టర్లే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
పునీత్ మరణంలో డాక్టర్ రమణారావుపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న ఫ్యాన్స్.. ఆయన క్లినిక్ వద్ద రెక్కీలు నిర్వహిస్తున్నారు. కొన్ని అభిమాన సంఘాలైతే నేరుగా ఆస్పత్రి వద్ద ధర్నాకు సైతం ప్రయత్నించాయి. పునీత్ అంత్యక్రియలు పూర్తయిన మరుసటిరోజు నుంచి.. బెంగళూరు సదాశివనగర్ లోని డాక్టర్ రమణారావు ఇల్లు, క్లినిక్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఎప్పుడేం జరుగుతుందోననే ఉద్విగ్నత ఏర్పడింది. దీనిపై డాక్టర్ రమణారావుతోపాటు కర్ణాటక ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో..
పునీత్ మరణానికి డాక్టర్లే కారణమని, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టరైన రమణారావును టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్ రచ్చకు దిగిన నేపథ్యంలో కర్ణాటక పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డాక్టర్ రమణరావు ఇల్లు, క్లినిక్ వద్ద పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. కర్ణాటక స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన బలగాలను రమణారావు ఇల్లు, క్లినిక్ వద్ద మోహరింపజేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగనీయబోమని పోలీసులు చెబుతున్నారు. నిజానికి..
పునీత్ మరణంపై డాక్టర్ రమణరావు ముందు నుంచి వివరణ ఇస్తూనే ఉన్నారు. పునీత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, క్లినిక్‌కు వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్సలు చేశానని, 35 ఏళ్ల నుంచి తను రాజ్‌కుమార్ కుటుంబానికి వైద్యునిగా పని చేస్తున్నానని, పునీత్‌కు చికిత్సలో తమ వైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని రమణారావు చెబుతున్నారు. ఫ్యాన్స్ బెదిరింపుల నేపథ్యంలో అసలా రోజు ఏం జరిగిందో మరోసారి ఆయన పూసగుచ్చినట్లు వివరించారు..
‘అక్టోబర్ 29న ఉదయం జిమ్ చేసిన తరువాత సుస్తిగా ఉందంటూ పునీత్ రాజ్ కుమార్ ఉదయం 11.15కు క్లినిక్‌కు వచ్చారు. ఆయనకు అప్పటికే చెమటలు పట్టిన కారణంగా ఈసీజీ తీశా, గుండెపోటు వచ్చి ఉండవచ్చనే అనుమానంతో తక్షణం యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆస్పత్రికి వెళ్లాలని సూచించా. అయితే అంబులెన్స్ కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని వారి కారులోనే నాలుగైదు నిమిషాలలో ఆస్పత్రికి వెళ్లేలా చూశాం. అక్కడ చేసిన చికిత్స ఫలించలేని కారణంగా పునీత్ మృతి చెందారు. వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు’ అని డాక్టర్ రమణారావు పేర్కొన్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణంలో డాక్టర్ల పాత్రను అనుమానిస్తూ, క్లినిక్ లపై దాడులకు సిద్ధమవుతోన్న ఫ్యాన్స్ ను కట్టడి చేయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (ఫనా) కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తమ గోడు వెళ్లబోసుకుంది. పునీత్ మరణం తర్వాత డాక్టర్లను చిత్రీకరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పునీత్ మరణంపై తాము కూడా విచారిస్తున్నామని, ఈ బాధాకరమైన సమయంలోనే డాక్టర్లపై ఇలాంటి ప్రచారం జరుగుతుండటం విచారకరమని ఫనా అధ్యక్షుడు ప్రసన్న అన్నారు.
‘పునీత్ ను బతికించుకోడానికి డాక్టర్లందరూ ప్రయత్నించారు. ముఖ్యంగా డాక్టర్ రమణారావు తన వంతు కృషి చేశారు. అలాంటిది ఆయనపైనే వేళ్లెత్తి చూపడానికి జరుగుతోన్న ప్రయత్నాన్ని మేం ఖండిస్తున్నాం. వైద్య వృత్తికి కొన్ని పరిమితులంటూ ఉంటాయి. మేం ఎల్లవెళలా రోగులను కాపాడటం సాధ్యంకాదు. రోగి చనిపోవాలని ఏ డాక్టరూ అనుకోరు’అని ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న వ్యాఖ్యానించారు. పునీత్ మరణంపై ఫ్యాన్స్ అనుమానాలు అర్థం లేనివని, దీని వెనుక రాజకీయ కోణాలు ఉండి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.