Maha Shivratri 2022: హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి రోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.
అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయని, అభిషేకం అంటేనే దేవుళ్లకు ఎంతో ప్రీతికరమని పండితులు చెబుతారు. అందులోనూ శివుడు అభిషేక ప్రియుడని.. పరమేశ్వరునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందొచ్చు.. ఇక మహా శివరాత్రి రోజున ఆ భోళాశంకరుడికి కొన్ని ముఖ్యమైన పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం.
అయితే ఓ శివాలయంలో శివ లింగానికి పాలతో అభిషేకం చేయిస్తే.. మజ్జీగ లభిస్తుందట.. ఇంతకీ ఆ పరమేశ్వరుని దేవాలయం ఎక్కడుంది.. పాలు ఇస్తే మజ్జీగ ఎలా దొరుకుతుందో తెలుసా..? మన దేశంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులందరూ తమ కోరికలన్నీ తీరాలని.. కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివాలయానికి వెళ్తూ ఉంటారు.
బెంగళూరులోని శివాలయంలో.. ఈ నేపథ్యంలో భక్తులందరూ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. పాలు కూడా వృథా కాకుండా.. ఓ శివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని దాసరహళ్లిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఇక్కడ ఉన్న గంగాధరేశ్వర ఆలయంలో శివునికి పాలు సమర్పిస్తే, ఆలయ సభ్యులు వారికి మజ్జిగను ప్రసాద రూపంలో అందజేస్తున్నారు.
అభిషేకం చేసిన పాలు వృథా కాకుండా ఇలా చేయడం విశేషం. బెంగళూరులోని ప్రసిద్ధ పరమేశ్వరుని ఆలయాల్లో గంగాధరేశ్వర దేవాలయం ఒకటి. ఈ శివాలయంలో ప్రతి సోమవారం రోజున సుమారు 500 లీటర్ల పాలను భక్తులు సమర్పిస్తారు. ఇక మహా శివరాత్రి, ఇతర ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది లీటర్ల పాలు దేవాలయానికి అభిషేకం కోసం వస్తాయి.
ఆలయ కమిటీ సభ్యులు ఈ పాలన్నీ వృథా కాకుండా, వాటిని మజ్జీగ రూపంలో తిరిగి భక్తులకు అందజేస్తారు. దీంతో ఈ దేవాలయంలో పాలు అనేవి వృథా కావు. భక్తుల మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా ఇలా ఏర్పాటు చేశారు. ఈ శివాలయంలో పండితులు పూర్తిగా శుభ్రమైన లింగానికి పాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాతనే మిగిలిన పదార్థాలతో అభిషేకం చేస్తారు. మంగళవారాల్లో ఆలయాన్ని సందర్శించే వారికి ఇక్కడ మజ్జీగను అందజేస్తారు.
మజ్జీగ నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఇస్తారు. ఈ మజ్జీగను భక్తులందరూ అక్కడే తాగొచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి కూడా తాగొచ్చు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ప్లాస్టిక్ బాటిళ్లను ఇంటికి తీసుకెళ్లేందుకు దేవాలయ కమిటీ సభ్యులు అనుమతించరు. ప్లాస్టిక్ చెత్త కలపడం వల్ల మజ్జీగ నాణ్యత పోతుందని వారి అభిప్రాయం. తమ గుడి నుండే.. ఇలా ప్రజలకు పాలు పంచాలనే ఆలోచన ఆ దేవాలయం ప్రధాన అర్చకుడు ఈశ్వరానంద స్వామిజీది.