మన దేశంలో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండే మెట్రో సిటీ ఏదంటే... బెంగళూరు అని టక్కున చెబుతారు చాలా మంది. ఇండియాలో కరోనా కేసులు తగ్గుతుంటే... బెంగళూరులోని ఐటీ కంపెనీలు... తిరిగి ఆఫీసుల్లో కార్యకలాపాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాయి. ఇది గమనించిన కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పుడు గానీ కంపెనీలు ఇలా చేస్తే... మళ్లీ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయనీ... కాబట్టి.. మరికొంత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించేలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో 2022 డిసెంబర్ వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే పాటించమని ఐటీ కంపెనీలను కోరిది. తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఉండవనీ, అది అందరికీ మంచిదని చెప్పింది.
2022 డిసెంబర్ తర్వాత కూడా ట్రాఫిక్ ఉంటుందా అంటే ఉండదన్నది ప్రభుత్వ ప్లాన్. ఎందుకంటే... ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణం చేపడుతోంది. ఆ రూట్లో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలను వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని ప్రభుత్వం కోరింది. ఎందుకంటే... మెట్రో పనులు జరుగుతూ ఉంటే... ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే... ట్రాఫిక్ జామ్ బాగా పెరుగుతుంది. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు... ఈ సంవత్సరం అక్టోబర్ లేదా డిసెంబర్ వరకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంచుతున్నాయి. మెట్రో రైలు నిర్మాణం... 2 ఏళ్లలో పూర్తవుతుంది. ఆ తర్వాత ORR చుట్టుపక్కల ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుందన్నది ప్రభుత్వ ప్లాన్.
బెంగళూరులోని ORR మార్గంలో 800కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 1.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందువల్ల మామూలు రోజుల్లో అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బెంగళూరు వెళ్లేవారు అక్కడి ట్రాఫిక్ చూసి భయపడతారు. కిలోమీటర్ మార్గంలో 2 లేదా 3 సార్లు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఇలా సిగ్నల్స్ దగ్గర ఆగుతూ ఆగుతూ జస్ట్ 10 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణం 40 నిమిషాల నుంచి గంట పడుతుంది. ఇక పీక్ అవర్స్‌లో గంటన్నర కూడా పడుతుంది. రోడ్లను మరింతగా విస్తరించే అవకాశం లేదు. జనాభా సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతోంది. ఐతే... కరోనా వచ్చాక... వర్క్ ఫ్రమ్ హోమ్ అమలయ్యాక... ట్రాఫిక్ సమస్య సగానికి పైగా తగ్గింది.
ఇప్పుడు ప్రభుత్వం కోరడంతో... ఐటీ కంపెనీలు... వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH)ను డిసెంబర్ 2022 వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తప్పనిసరిగా కంపెనీలకు వెళ్లాల్సిందే అనుకుంటే... BMTC లేదా కంపెనీ బస్సుల్లో వెళ్లాలని ప్రభుత్వం కోరుతోంది. అదీకాక... కర్ణాటకలో కరోనా మరీ తగ్గిపోలేదు. ఈమధ్య అక్కడ పిల్లలకు కరోనా సోకింది. అందువల్ల కోవిడ్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆఫీసులు తెరవాల్సిన అత్యవసర పరిస్థితి కనిపించట్లేదు. ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా... పనులు జరిగిపోతున్నాయి కాబట్టి... ప్రభుత్వ సూచనను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.