Ayodhya Ram Temple: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఎప్పటికి పూర్తవుతుంది.. ఎప్పుడు శ్రీరాముడిని దర్శనం చేసుకుంటామని ఎదురుచూస్తున్నారు. అయితే రామ మందిరం.. అంటే దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా అన్నీ కలిపి 2025 నాటికి నిర్ణాణం పూర్తికానుంది.
అయితే నిర్మాణం పూర్తైనంత వరకు అప్పటి వరకు భక్తులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. గతేడాది ఆగస్టు-5న ప్రధాని మోదీ చేతులమీదుగా నేటికి రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.
అయోధ్య సర్వతోముఖాభివృద్ధి కోసం ఇప్పటికే బ్లూప్రింట్, విజన్ డాక్యుమెంట్లను తయారు చేసేందుకు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థ అయిన ఎల్ఈఏ అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 27 ప్రాజెక్టుల జాబితాను సమర్పించింది. వీటిలో 10 ప్రాజెక్టులకు సంబంధించిన సవివరమైన నివేదికలను త్వరలోనే తయారు చేయనున్నారు.
అయోధ్యను దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేయడం కోసం 100 కోట్ల రూపాయలతో అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 321 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనికి మర్యాదా పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయంగా నామకరణం చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం అదనంగా 555 ఎకరాల భూమిని సేకరించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 250 కోట్లు విడుదల చేసింది.
శిథిలాలు తొలగించిన స్థలాలను నింపేందుకు ఇప్పటికే రోజుకు 140 ట్రక్కుల మట్టి వస్తోంది. ఈ పనులు మార్చి నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఐఐటీ చెన్నై ఆధ్వర్యంలో సాగుతున్నాయి. మొత్తంగా 8 ఇంచుల మందం ఉండే.. 44 పొరలుగా మట్టి వేయాల్సి ఉంది. మంగళవారం నాటికి 71 లక్షల క్యూబిక్ మీటర్ల ఫిల్లింగ్ పూర్తవ్వగా.. ఈ పనులు సెప్టెంబర్ 15 నాటికి ముగుస్తాయని అంచనా వేస్తున్నారు.