కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాల్లో ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ (ఒప్పంద వ్యవసాయం - Contract Farming)కి చెందినది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామనీ, పంటను కొనేవారే లాభపడతారని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. కానీ వాస్తవంలో అలా జరగట్లేదని గుజరాత్ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. చెప్పడమే కాదు వాస్తవాన్ని చూపిస్తున్నారు కూడా. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది గుజరాత్లో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఏ రైతులూ... ఇందుకోసం కాంట్రాక్ట్ పత్రాలపై సంతకాల వంటివి చెయ్యరు. నోటి మాటగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. అహ్మదాబాద్... నరోడా పండ్ల మార్కెట్లో హోల్ సేల్ వ్యాపారులు... పండ్ల కోసం రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు.
నరోడా పండ్ల మార్కెట్ ఛైర్మన్ లక్ష్మణ్ భాయ్ రోహ్రా స్వయంగా ఓ హోల్ సేల్ వ్యాపారి కూడా. ఈయన కచ్‌లోని జయంతి భాయ్ అనే రైతుతో ఒప్పంద వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకోసం ఆ రైతు శాఫ్రాన్ మామిడి, దానిమ్మ పంట వేశాడు. కాంట్రాక్ట్ ప్రకారం ఆ రైతు A1 క్వాలిటీ పండ్లను (నాణ్యమైనవి) పండించాల్సి ఉంటుంది. అలా నాణ్యమైనవి పండిస్తే... మార్కెట్లో ఉన్న ధర కంటే రెట్టింపు ధరకు లక్ష్మణ్ భాయ్ కొంటున్నారు. ఫలితంగా రైతుకు రెట్టింపు ఆదాయం వస్తోంది.
లక్ష్మణ్ భాయ్ ఏమన్నారంటే... "సాధారణ మామిడి మార్కెట్లో కేజీకి రూ.30 నుంచి రూ.35 పలుకుతోంది అనుకుందాం.... అలాంటప్పుడు నాణ్యమైన మామిడి ధర కేజీ రూ.60 నుంచి రూ.70 పెట్టి కొంటాం. దాంతోపాటూ మేం రైతులకు పురుగుమందులు ఇస్తాం. అలాగే ప్యాకింగ్ మెటీరియల్ ఉన్న ఓ బాక్స్ ఇస్తాం. ఒకవేళ రైతు స్వయంగా పంట పండించలేకపోతే... మేమే రైతుకు రూ.10 నుంచి రూ.20 లక్షల దాకా ఇచ్చి పంట పండించేలా చేస్తాం." అని అన్నారు.
లక్ష్మన్ భాయ్ మాత్రమే కాదు... మహ్మద్ అఫ్జల్ ఇబ్రహీం మెమన్ అనే పండ్ల వ్యాపారి కూడా రైతులతో ఇలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు. కచ్తోపాటూ.. జునాగఢ్‌లోని మరో రైతు దాస్ భాయ్ అంకోల్వాడీతోనూ ఇదే డీల్ కుదుర్చుకున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ అనే పదం కంటే... సత్సంబంధాలు అనే పదం కరెక్ట్ అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే తాము రైతులతో సత్సంబంధాలు కలిగి ఉంటామనీ... ఏ సంతకాలూ లేకుండా మాటలతోనే డీల్ మాట్లాడుకొని దానికి కట్టుబడి పనిచేసుకుంటూ... అందరం లాభ పడుతున్నామని అంటున్నారు. గుజరాత్లో సీజన్ ఆరంభంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, ఇతరత్రా అవసరమైనవి వ్యాపారులే ఇస్తారు. పంట చేతికి వచ్చే ముందే మార్కెట్లో ధర ఎంత ఉన్నదీ రైతుకు చెబుతారు. ఒకవేళ రైతుకు వేరే మార్కెట్లో ఇంకా ఎక్కువ ధర వచ్చేలా ఉంటే... రైతును అక్కడే అమ్ముకోనిస్తారు. అందువల్ల రైతులకు నష్టం అన్నదే జరగట్లేదు. ఇలా అహ్మదాబాద్‌లో మొత్తం 50 మంది పండ్ల వ్యాపారులు... గుజరాత్లో 200 మంది పండ్ల వ్యాపారులు ఈ తరహా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేపడుతున్నారు.