పశ్చిమ బెంగాల్ వైద్యులు పరిమిత వైద్య సదుపాయాలతోనే అరుదైన ఘనత సాధించారు. గర్భాశయం రెండు భాగాలుగా ఉన్న ఒక గర్భిణికి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ అరుదైన శస్త్రచికిత్సతో ఆ తల్లి ఇద్దరు కవల మగబిడ్డలకు జన్మనిచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాలో శాంతిపూర్ పరిధితోని నార్సింగ్‌పూర్ ప్రాంతానికి చెందిన అర్పితా మోండల్ అనే గర్భిణికి ఈ అరుదైన సర్జరీ జరిగింది. ఆమెకు బైకార్న్యుయేట్ యుటిరస్ (bicornuate uterus) ఉంది. అంటే గర్భాశయం గుండె ఆకారంలో రెండు విభాగాలుగా ఉంటుంది.
దాదాపు 3 శాతం మంది గర్భిణులకు ఇలా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భాశయం ఆకృతి అనేది, కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో శిశువులు ఆకారం లేదా నిర్మాణ పరమైన లోపాలతో జన్మించే అవకాశాలు ఉన్నాయి. డబుల్ గర్భాశయం ఉన్న స్త్రీలు ఇతరుల మాదిరిగానే ఆరోగ్యంగానే ఉంటారు. కానీ ఈ పరిస్థితి గర్భస్రావానికి దారితీయవచ్చు, లేదా నెలలు నిండక ముందే ప్రసవం కావచ్చు.
ఈ సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పవిత్ర బయాపరి పర్యవేక్షణలో అర్పితకు ఆపరేషన్ నిర్వహించగా, ఆమె ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఈ ఆపరేషన్ చేసేందుకు ఆయన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి సర్జరీ విజయవంతం కాగా.. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బయాపరి తెలిపారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ పవిత్ర బయాపరి కోల్‌కతా నీలరతన్ సర్కార్ మెడికల్ కాలేజీలో MBBS చదివారు. తర్వాత నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి MD కోర్సు పూర్తి చేశారు. తర్వాత శాంతిపూర్ స్టేట్ జనరల్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్‌గా నియమితులయ్యారు. అయితే ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన మెరుగుపడితే ఇలాంటి సర్జరీలు చేయవచ్చని, లేదంటే కొన్నిసార్లు బాధితులకు ఇబ్బందులు తప్పవని పవిత్ర బయాపరి చెబుతున్నారు. మొత్తానికి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినందుకు అర్పితా మోండల్, ఆమె భర్త రాజేశ్ మోండల్ హర్షం వ్యక్తం చేశారు.