రోజుకో కొత్త రూపంలో ఇండియాలో సైబర్ మోసాలు నమోదవుతున్నాయి. ఉద్యోగాలు, ఆఫర్లు, బ్యాంక్ సేవల పేరుతో బాధితుల అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒక ఫేక్ లింక్‌పై క్లిక్ చేసి రూ.9 లక్షలు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ పేరుతో బాధితుడిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..
ANI రిపోర్ట్ ప్రకారం.. ఢిల్లీలోని పితంపురకు చెందిన హరీన్ బన్సల్ సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు 'వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించండి’ అనే పోస్ట్ చూశాడు. బన్సల్ ఆ పోస్ట్‌పై క్లిక్ చేయగా, ఓ వ్యక్తి వాట్సాన్ నంబర్ కనిపించింది. అక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఓ లింక్ సెండ్ చేశాడు.
అనంతరం వర్క్-ఫర్-హోమ్ జాబ్‌లో భాగంగా, అతనికి ఇచ్చిన వర్క్‌ని కంప్లీట్ చేయాలని వెబ్సైట్ సూచించింది. వర్క్ చేసినందుకు అందాల్సిన డబ్బును విత్‌డ్రా చేయడానికి కొంత మొత్తం డిపాజిట్ చేయాలని, కమీషన్‌తో కలిపి ఆ మొత్తం తీసుకోవచ్చని వెబ్సైట్ చూపేది. ఇలా బాధితుడు మొదట్లో కొంత డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతనికి తక్షణమే కమీషన్‌తో డబ్బు అందించినట్లు కనిపించింది. ఇలా క్యాష్ విత్‌డ్రా అవుతుండటంతో అతడికి నమ్మకం పెరిగింది.
చివరికి అతడు సుమారు రూ.9,32,000 డిపాజిట్ చేసిన తర్వాత తన డబ్బును విత్‌డ్రా చేసుకోలేకపోయాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అంకిత్ (30), సుధీర్ కుమార్ (45) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
* నమ్మితే మోసపోయినట్లే.. : స్కామర్లు ఉద్యోగం లేదా పార్ట్‌టైమ్ అవకాశం సాకుతో ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో కూడా సోషల్ మీడియాలో చూసిన జాబ్ పోస్ట్‌లపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ఆన్లైన్ బాట పడుతున్న వారే లక్ష్యంగా స్కామర్లు వల పన్నుతున్నారు.
ఈ స్కామర్లు ప్రజలను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి, ఆపై వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కనెక్ట్ అవుతారు. పని కేటాయించినట్లు, వర్క్ జరుగుతున్నట్లు, డబ్బు సంపాదిస్తున్నట్లు తొలుత నమ్మిస్తారు. డబ్బు విత్‌డ్రా చేయాలంటే కొంత మొత్తం యాడ్ చేయాలని, చేయాల్సిన వర్క్‌లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణాలు చెబుతారు. బాధితుడు డబ్బులు డిపాజిట్ చేశాక, కొంత కాలం కమీషన్ అందిస్తారు. పూర్తిగా నమ్మిన ప్రజలు ఆశతో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేశాక.. ఇంకేముంది.. సంబంధిత వెబ్సైట్ ఒక్కసారిగా మాయం అవుతుంది.