కళాకారుడి నిజమైన బాధ్యత కళను బ్రతికించుకోవడం."కళ సమాజం కోసం, కళ కోసం పోరాడి నిలబడే తత్వం కొందరికే సొంతం. కళ సంస్కృతిలో అంతర్భాగం. నిజమైన కళాకారుడిగా మారడానికి చాలా ప్రతిభ అవసరం. దృఢ సంకల్పం , ఓర్పు, పోరాట స్ఫూర్తి గల వారు మాత్రమే విభిన్న కళలలో రాణించగలరు. అటువంటి ఓ విభిన్న కళాకారుడే శ్రావణ్ కుమార్.
సృజనాత్మకతకు ఓపిక కలగలిసిన ఆర్ట్ ఎంచుకుని అందులో సాగిపోతున్న విజయవాడకు చెందిన శ్రావణ్ జీవితంలో ఎన్నో విశేషాలు దాగున్నాయి. వైవిధ్యమైన ఈ కళ ఎన్నిక, శ్రమ, సహనం వెనుక అతని క్రీడా స్ఫూర్తి కూడా దాగుంది. శ్రావణ్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. కిరాణా కొట్టులో పని చేయడం దగ్గర నుంచి ఓ ఫుట్ వేర్ కంపెనీ వరకు తన జీవితం శ్రమతోనే సాగింది.
రాష్ట్రం తరపున జాతీయ స్థాయిలో సైక్లింగ్ లో పాల్గొని అనేక మెడల్స్ సాధించిన వ్యక్తిగా శ్రావణ్ కుమార్ కి ప్రత్యకమైన గుర్తింపు పొందారు. విజయవాడ సైక్లింగ్ క్లబ్లో కీలకమైన వ్యక్తిగా టూరిస్ట్ లకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి వారికి సహాయం చేయడం, కొత్తగా సైక్లింగ్ నేర్చుకునే వారికి మెళకువలు చెప్పి శిక్షణలో తర్ఫీదు ఇస్తున్నాడు.
అలాగే మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడే విద్యార్థులను వాటి నుండి కాపాడేందుకు సైక్లింగ్ చేసిన మానసిక వైద్య బృందంతో కలిసి పనిచేశారు. దాని కోసం సైకిల్ ర్యాలీ చేశారు. చాలా చిన్న వయసులోనే చిన్న చిన్న మనస్పర్థలు, కారణాలతో యువతరం ఆత్మహత్యలకు పాల్పడుతుంది. దాన్ని నియంత్రించి బ్రతికే ధైర్యం కల్పించడమే శ్రావణ్ ఆశించేది.
విజయవాడ యానిమల్ కేర్ టేకర్స్ గ్రూప్‌లో చురుకుగా పాల్గొనే సభ్యుడిగా శ్రావణ్‌కు మంచి గుర్తింపు ఉంది. ప్లాస్టిక్ వాడకం, కృష్ణా నదిలో పేరుకుపోతున్న చెత్త , రక్తదానం ఇలా అనేక సామాజిక అంశాల్లో అవగాహన కల్పిస్తూ సామాజిక కార్యకర్తగా తన వంతు పాత్రను పోషిస్తున్నారు. తనకు ఏదైనా రాదు అంటే ఒప్పుకుడో శ్రావణ్. ఎలాగైనా అది సాధించి నేర్చుకుని చూపుతాడు. దానికి నిదర్శనం మైక్రో ఆర్ట్స్.
ఈరోజు ఉన్న ఎందరో కొత్త తరం మైక్రో ఆర్టిస్టులకు మెళకువలు నేర్పిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్నాడు. లీఫ్ ఆర్ట్‌పై ఆసక్తి ఉన్న వాళ్లకు తానే స్వయంగా మెటీరియల్ సేకరించి పంపి ప్రోత్సహించే గుణంతో మైక్రో ఆర్ట్ నుండి లీఫ్ ఆర్ట్ లోకి మారారు. లీఫ్ ఆర్ట్ నేర్చుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఒక చిత్రకారుడు, క్రీడాకారుడు, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలు పోషిస్తూ సమాజం పట్ల బాధ్యత కలిగిన శ్రావణ్ కుమార్ కళకు అంకితమయ్యాడు.
మరుగునపడిన లీఫ్ ఆర్ట్ కి వైభవం చేకూర్చాలని సంకల్పించారు. డబ్బుకన్నా కళకు గౌరవం ముఖ్యం, కళాకారుడి నిజమైన బాధ్యత ఇదే. నాకు మాత్రమే పేరు ప్రఖ్యాతులు రావాలనే స్వార్థంతో నడిస్తే డబ్బు సంపాదించి, మెడల్స్ సాధిస్తాం కానీ కళను బ్రతికించుకోలేము. కళను బ్రతికించుకోవడమే కళాకారుడి ధర్మం అని శ్రావణ్ కుమార్ అంటున్నారు. శ్రావణ్ కి ఈ ప్రయత్నంలో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ శ్రీనివాస్ నుండి చక్కని ప్రోత్సాహం అందించి శ్రావణ్ కుమార్ లీఫ్ఆర్టిస్ట్ క్రియేటివ్ టీమ్ కి మెంబర్‌గా చూస్తున్నామన్నారు
లీఫ్ ఆర్ట్ అనేది చాలా పురాతన చిత్రకళ. దీని మూలాలు చైనా, జపాన్, భారత దేశాల్లో ఉన్నాయి. ఈ చిత్రకళ చాలా క్లిష్టమైన మరియు శ్రమతో కూడిన కళారూపం. దీనికి చాలా అంకితభావం, నైపుణ్యత అవసరం. అలాగే ఈ కళలో ప్రావీణ్యం పొందడానికి సంవత్సరాలు పడుతుంది. లీఫ్ ఆర్ట్ కి ప్రధానంగా ఉపయోగించేది రావి ఆకు. రావి చెట్టుకు అటు పురాణాల్లో, వైద్యంలో , ఆధ్యాత్మికంలో ప్రత్యేక స్థానం ఉంది.