ఏపీలో తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు కరోనాతోనే ఎన్నో కోట్లు నష్టపోయిన ఇండస్ట్రీకి కొన్నాళ్లుగా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా మరింత తలపోటుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా మొన్న భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాల విడుదలైనా కూడా జగన్ ప్రభుత్వం కనికరించలేదు. దాంతో ఈ చిత్రానికి ఏపీలో భారీ నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
టికెట్ రేట్ల దగ్గర కూడా చాలా కఠినంగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టికెట్ రేట్స్ పేరు మీద జనాన్ని దోచుకుంటే ఊరుకునేది లేదంటూ ఆయన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. అక్కడే అందరికీ సమస్యలు వస్తున్నాయి. దీనిపై ఈ మధ్యే చిరంజీవి సిఎంను కలిసి పరిస్థితులు వివరించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలు కూడా వెళ్లి జగన్‌ను కలిసి ముచ్చటించి వచ్చారు. ఇది జరిగి కూడా 20 రోజులు అయిపోయింది.
ఎక్కడెక్కడో ఉన్న జీవోలన్నింటినీ తీసుకొచ్చి టికెట్ రేట్స్ 20, 30, 50, 70 రూపాయలకు మాత్రమే అమ్మాలంటూ రూల్ పాస్ చేసాడు. 2021 ఎప్రిల్ నుంచి ఇది అమలులోకి వచ్చింది. అలా బలైపోయిన మొదటి సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు బ్లాక్ బస్టర్ అవ్వాలి కానీ చివరికి 5 కోట్ల నష్టం వచ్చింది. ఈ జీవో వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతున్నారు. ఈ విషయాలన్నింటి మీద సినీ పెద్దలు ఈ మధ్యే జగన్‌తో మాట్లాడాడు.
చిరంజీవి ఒక్కడే వెళ్లి సిఎం జగన్‌ను కలిసి వచ్చిన తర్వాత హీరోలు, నిర్మాతలంతా కలిసి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అప్పుడే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఆయనకు కూలంకశంగా వివరించే ప్రయత్నం చేసారు. దానికి జగన్ తరఫు నుంచి కూడా సానకూలంగానే స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు వాళ్లు. దీనికి ప్రతిఫలం ఇప్పుడు వచ్చేలా కనిపిస్తుంది.
సినీ ప్రముఖులతో జరిపిన చర్చలు సఫలం అయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి శుభవార్త చెప్పేలా కనిపిస్తుంది. సినిమా టిక్కెట్ రేట్ల వివాదాన్ని ఓ కొలిక్కే తెచ్చే ప్రయత్నాలు జోరుగానే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మార్చ్ 10 లోపే కొత్త టికెట్ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది.
సినిమాకు తగ్గట్లుగా సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని.. కాకపోతే ప్రతీ సినిమాకు రేట్లు పెంచకుండా.. పెద్ద సినిమాలకు మాత్రమే అనువుగా ఉండేలా ఈ టికెట్ రేట్లు పెంచుకోవాలని ప్రభుత్వం సూచించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజుల పాటు నిర్మాతలు ఏయే విషయాలపై అయితే జగన్‌కు అభ్యర్థన పెట్టుకున్నారో.. అవన్నీ పూర్తిగా సంతృప్తి చెందేలాగే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటి వరకు టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం భీమ్లా నాయక్ సినిమా అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. పవన్ సినిమాకు బెనిఫిట్స్ రాకూడదనే కారణంతోనే భీమ్లా వచ్చినపుడు టికెట్ రేట్ల గురించి జగన్ సర్కార్ మాట్లాడలేదని.. ఇప్పుడు రాధే శ్యామ్ సహా ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల సడలింపుపై తీపికబురు చెప్పబోతుందనే వార్తలు వస్తున్నాయి. మార్చ్ 8 లేదంటే 10న ఈ నిర్ణయం చెప్తారనే వార్తలొస్తున్నాయి.
పవన్ సినిమా విడుదలై రెండు వారాలు దాటిపోయింది కాబట్టి ఇప్పట్నుంచి వచ్చే సినిమాలకు ఈ కొత్త టికెట్ రేట్లు అడ్వాంటేజ్ కానున్నాయి. వీలైనంత త్వరగా సినిమా ఇండస్ట్రీ సమస్యలను ఓ కొలిక్కి తీసుకురావాలని సిఎం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది తెలిసి హమ్మయ్యా అంటూ గుండెలపై చేయి వేసుకుంటున్నారు నిర్మాతలు. ఏదేమైనా అన్నీ అనుకున్నట్లు జరిగి టికెట్ రేట్స్ ఇష్యూ కొలిక్కి వస్తే నిర్మాతలకు అంతకంటే కావాల్సింది మరోటి లేదు అంటున్నారు విశ్లేషకులు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?