తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఓ పార్టీ వాళ్లు.. మరో పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
నిజంగానే ఇప్పుడు వైసీపీలో చేరిన కొందరు కమెడియన్లు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోతున్నారు. అది యాదృశ్చికంగా జరుగుతుందా లేదంటే కావాలనే వాళ్లకు అవకాశాలు రాకుండా చేస్తున్నారో తెలియడం లేదు కానీ వాళ్ళ కెరీర్ మాత్రం ఒకప్పట్లా లేదు. వాళ్లే పోసాని కృష్ణమురళి, అలీ, 30 ఇయర్స్ పృథ్వీ. వీళ్ల పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వందల సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వాళ్లు.
ఒక్కొక్కరు కొన్ని దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటూ.. ఏ రోజూ ఛాన్సుల కోసం చూడలేదు. అవే వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు వాళ్లకు ఆ గతి పట్టేలా కనిపిస్తుంది. ఎందుకో తెలియదు మరి ఇప్పుడు ఈ ముగ్గురు కమెడియన్లకు ఆఫర్లు కరువయ్యాయి. ఎన్నికలు పూర్తి కావడం.. అనుకున్నట్లుగానే జగన్ అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళితో పాటు అలీ, పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇక ఎలక్షన్స్ ఎలాగూ అయిపోయాయి కదా.. రాజకీయాల నుంచి ఫ్రీ అయిపోయి సినిమాలు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు వాళ్లకు అనుకున్నంతగా ఆఫర్లు రావడం లేదు. ఇదే విషయంపై పోసాని కూడా సంచలన కమెంట్స్ చేసాడు అప్పట్లో. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగుదేశం వాళ్లే ఉన్నారని.. దాంతో తనకు ఆఫర్లు రాకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు పోసాని కృష్ణమురళి.
ఈ మధ్యే తనను ఓ పెద్ద సినిమా నుంచి తప్పించారని.. అలాంటి దర్శక నిర్మాతలు చాలానే ఉన్నారంటున్నాడు ఈయన. అలాంటి వాళ్లలో అశ్వినీదత్ పేరు కూడా చెప్పాడు పోసాని. ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్‌ను ఈయన టార్గెట్ చేసిన విధానం చూసిన తర్వాత అవకాశాలు మునపటిలా వస్తాయనుకోవడం అత్యాశే.