తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆయన్ని మించిపోయే వాళ్లు.. ఆయనతో సరితూగేవాళ్లు ఎవరూ లేరు.. ఇంకెప్పటికీ రారు. దాసరితో విభేదాలున్న వాళ్లు కూడా ఒప్పుకునే మాట ఇది. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్ద అనే మాట దాసరికి తప్ప మరొకరికి సాధ్యం కాదు. ఆయన మాత్రమే ఇండస్ట్రీ పెద్ద.. ఆయన కోసమే ఈ పదం పుట్టిందేమో అనేలా ఉండేవాడు దర్శకరత్న.
చనిపోయే వరకు కూడా చిన్న సినిమాలకు ప్రాణమిచ్చాడు. అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా నేనున్నాను అంటూ సమస్యల వైపు పరుగులు పెట్టేవాడు దాసరి. అలాంటి పెద్ద మనిషి పోయిన తర్వాత నిజంగానే ఇండస్ట్రీలో చాలా వరకు గొడవలు బయటికి వచ్చాయి. అప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదాలన్నీ ఒక్కసారిగా అందరి కళ్ల ముందుకు వచ్చేసాయి.
దాసరి పోయిన తర్వాత ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. చిరంజీవి కొంతవరకు దాసరి స్థానాన్ని తీసుకుంటున్నాడనే ప్రచారం జరిగినా.. దాన్ని చాలా మంది ఎవరూ ఒప్పుకోలేదు. మా దాసరి గారి ప్లేస్ ఎవరూ తీసుకోలేరు.. దాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ మోహన్ బాబు ఇప్పటికే చెప్పాడు.
ఇప్పుడు అదే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన గురువు దాసరి స్థానం కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం భారీగానే జరుగుతుంది. ముఖ్యంగా తన మనసులో ఏముందో తెలియదు కానీ తన పక్కనున్న వాళ్లు మాత్రం ఇండస్ట్రీకి మరో దాసరి వచ్చాడనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మొన్న మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నరేష్ ఇదే మాటన్నాడు.
దాసరి తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయిందని.. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా మోహన్ బాబు మారుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. దానికి పక్కనే ఉన్న మోహన్ బాబు.. తనకు దాసరి అయ్యేంత స్థాయి లేదని చెప్పాడు కానీ ఇండస్ట్రీ పెద్ద అవ్వాలని లేదని మాత్రం చెప్పలేదు. ఆయన మనసులో కూడా ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవాలని ఉందనే విషయం ఇక్కడే క్లారిటీ వచ్చేసింది.