ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. మరీ ముఖ్యంగా తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి (Uppena fame Krithi Shetty) ముందుంది. ఉప్పెనతో పరిచయం అయిన బేబమ్మ.. విడుదల తర్వాత కుర్రాళ్లందరికీ ఫేవరేట్ అయిపోయింది.
ఒక్క సినిమాతోనే కావాల్సినంత స్టార్ డమ్ సంపాదించుకుంది కృతి శెట్టి. ఏం చేస్తాం.. కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు సుడి అలా తిరుగుతుంది మరి. కొందరు ముద్దుగుమ్మలకు ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా హిట్స్ రావు. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే చక్రం తిరిగిపోతుంది. ఇప్పుడు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసారు.
నిజానికి ఉప్పెనలో ముందు హీరోయిన్ ఈమె కాదు.. మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని ఎందుకో మనసు కుదరక కృతి వైపు వచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఇదే. ఈ సినిమాకు 51 కోట్లు షేర్ వసూలు చేసింది. ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో కృతి గురించి చర్చలు మొదలయ్యాయి.
చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఆమెను సంప్రదించే కంటే ముందుగానే ఆమె రేట్ తెలిసి షాక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఈ సినిమా విడుదలకు ముందే నాని శ్యామ్ సింగ రాయ్.. సుధీర్ బాబు సినిమాల కోసం 25 లక్షల చొప్పున తీసుకుంటుంది.
ఇకపై సైన్ చేసే సినిమాలకు మాత్రం అక్షరాలా 60 లక్షలు కావాలంటుందని తెలుస్తుంది. పైగా ఈమె వయసు ప్రస్తుతం 18 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత ఈమెకు ఎంతైనా ఇవ్వొచ్చులే అనుకుంటున్నారు నిర్మాతలు. అందాలు ఆరబోయకపోయినా కూడా నటన పరంగా కృతి సత్తా చూపిస్తుందని నమ్ముతున్నారు.
ఇప్పటికే సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లకు తెలుగు స్పష్టంగా రాకపోయినా కూడా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్తున్నారు. ఫిదా, మహానటి లాంటి సినిమాల్లో వాళ్లు చెప్పిన డబ్బింగ్ చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు తాను కూడా అలాగే డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నారు కృతి. మరి ఆ అవకాశం ఎప్పుడు ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలి.