‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ వరస సినిమాలు చేస్తున్నాడు. ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్స్ ముందుకొస్తున్నారు. మొన్నటి వరకు కుర్ర దర్శకులతోనే పని చేస్తూ వచ్చిన ఈయన.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్‌తో వరస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ సూపర్ ఫాస్టుగా జరుగుతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు గోపీచంద్ మలినేని.
వీలైనంత వరకు మూడు నాలుగు షెడ్యూల్స్‌లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు గోపీచంద్ మలినేని, బాలకృష్ణ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ కాకుండా మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఈ పాత్ర కోసం చాలా మందిని సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ పాత్ర కోసం ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని సంప్రదిస్తే.. దానికి ఆమె సున్నితంగా నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ టాప్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడటంతో అమ్మడు దూకుడు మీదుంది.
ప్రస్తుతం రామ్ ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిటైంది కృతి. ఇలాంటి సమయంలో ఆమెకు బాలయ్య సినిమాలో అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య కూతురు కారెక్టర్ ఒకటి ఉందని.. అందులో నటించడానికి అడిగితే ఈమె నో చెప్పిందని ప్రచారం జరుగుతుంది.