అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కూడా రెండు వారాలు అయిపోయి ఉండేది. కానీ ఏం చేస్తాం.. కరోనా కారణంగా జనవరి 7న రావాల్సిన సినిమా మరోసారి వాయిదా పడింది. అయితే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలు వేచి చూస్తున్నాయి. ఇప్పటికే సినిమా అంతా పూర్తైపోయింది. కేవలం విడుదల తేదీ కోసమే చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇలాంటి సమయంలో రోజుకో వార్త సినిమా గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం చరణ్, ఎన్టీఆర్ ప్రత్యేకంగా రెండు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. దీనికోసం 90 కోట్ల వరకు ఖర్చు చేసారు దర్శక నిర్మాతలు. ఇండియన్ సినిమాలో ఎప్పుడూ లేనంత గ్రాండియర్ క్లైమాక్స్ ఈ సినిమా కోసం ప్లాన్ చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి.
పైగా ఒకప్పట్లా హీరోలు బతికితేనే సినిమా చూస్తాం.. చచ్చిపోతే చూడం అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఆడియన్స్ లేరు. వాళ్లకు మంచి కథ చెప్తే చాలు.. అందులో హీరో పాత్రలా ఉంటే సరిపోతుంది. చివర్లో హీరోకు నెగిటివ్ ఎండింగ్ ఇచ్చినా కూడా అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆడియన్స్. కలర్ ఫోటోలో హీరో చనిపోతాడు అయినా ఆదరించారు. గతేడాది ఉప్పెన సినిమా క్లైమాక్స్ నెగిటివ్‌గానే ఉంటుంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.
అలా హీరోలు చనిపోయినా.. అంగవైకల్యంతో ఉన్నా కూడా ఆదరిస్తున్నారు. కథ బాగుంటే చాలంటున్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన సినిమాలో అలాంటి ఎండింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తుంది. ట్రాజిక్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అంటే హీరోలిద్దర్నీ చంపేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..?
అలాంటిదేం లేదు.. చచ్చిపోరు కానీ ట్రాజికల్ ఎండింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తన సినిమాల్లో హీరో చనిపోయినా కూడా చాలా ఎమోషనల్‌గా చూపిస్తుంటాడు రాజమౌళి. విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాలలో హీరోను చంపేసినా కూడా చాలా ఎమోషనల్‌గా చూపించాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలోనూ ఇదే చేయబోతున్నాడు.
ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా బ్రిటీష్ వాళ్లతో పోరాటంలో భాగంగా ఆ ఇద్దరూ వైకల్యం పొందుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రకు కళ్లు పోతే.. రామ్ చరణ్ పాత్ర కాళ్లు కోల్పోతుందని వార్తలు వస్తున్నాయి. దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయని వీర సైనికులుగా ఇందులో నటిస్తున్నారు వాళ్లు.
అయితే అంతా అనుకుంటున్నట్లు ట్రిపుల్ ఆర్ దేశభక్తి సినిమా కాదని.. స్నేహం విలువ చెప్పే కథ అంటున్నాడు రాజమౌళి. అయితే క్లైమాక్స్‌లో కళ్లు, కాళ్లు పోయినా కూడా ట్రాజిక్ క్లైమాక్స్‌లా కాకుండా చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఈ క్లైమాక్స్ సీన్ 40 నిమిషాల పాటు ఉంటుందని.. అందులోనే ఆంగ్లేయులతో పోరాడే సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తుంది.
వీటి కోసం 90 కోట్లు నిర్మాత దానయ్య ఖర్చు చేసారని ప్రచారం జరుగుతుంది. 40 నిమిషాల క్లైమాక్స్ అంటే చిన్న విషయం కాదు. కానీ కన్నుల పండుగలా ఈ క్లైమాక్స్ సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించినట్లు తెలుస్తుంది. పరిస్థితులను బట్టి మార్చ్ 18 కానీ లేదంటే ఎప్రిల్ 28న కానీ ట్రిపుల్ ఆర్ విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.