తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్. ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో.
‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. ఈయన దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో అవార్డు అందుకున్న నటుడు ఈయనే. హీరోగా చిత్రం సినిమాకు ఇతను అందుకున్న తొలి పారితోషకం రూ. 11 వేలు. ఆ తర్వాత కోట్లలో పారితోషకాలు తీసుకున్నాడు కూడా.
ఉదయ్ కిరణ్‌కు నిఖార్సైన డిజాస్టర్ రావడానికి రెండేళ్లకు పైగానే పట్టింది. ఈయనతో సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అనే నమ్మకం నిర్మాతల్లో కలిగించాడు ఉదయ్. ముఖ్యంగా రూ. 2 కోట్లతో సినిమాలు చేసి రూ. 15 కోట్లు వెనకేసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు. బంగారు బాతు అనే పదానికి కొన్నేళ్ల పాటు ప్రత్యక్ష నిదర్శనంలా ఉన్నాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత కెరీర్ డైలమాలో పడిపోయింది.
అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన చాన్సులు నిలబడక.. కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఇపుడు ఇతను ఉండి ఉంటే.. ఏదైనా వెబ్ సిరీస్‌లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగించేవాడంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.
ఎందుకు అలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు. కానీ దానికి సాక్ష్యాలు లేవు.. మొత్తానికి ఏదైనా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా నేలవాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను టాలీవుడ్‌ను ఏలుతున్న ఓ కుటుంబం చిధిమేశారని అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. ఏమైనా విధిరాతను ఎవరు తప్పించలేరు. ఇందులో ఎవరు ఎవరినీ నిందించడం కూడా తప్పే. ఈయన దూరమై 8 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్‌ను తలుచుకుంటూ బాధ పడుతుంటారు అభిమానులు. అతడికి నివాళి అర్పిస్తున్నారు.