తెలుగు ఇండస్ట్రీలో ఇఫ్పుడు థమన్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర సినిమాలకు రీ రికార్డింగ్ కూడా చేస్తున్నాడు ఈయన. ప్రభాస్ సినిమాకు కూడా ఇదే చేసాడు థమన్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ రాధే శ్యామ్. విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తమన్. నిజమైన ప్రేమకు నిదర్శనం రాధే శ్యామ్.. ఖచ్చితంగా ఈ సినిమా చాలా రోజుల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పారు ఈయన. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్ రీ రికార్డింగ్ చేశారు. రాధే శ్యామ్ సినిమా తాను డబ్బుల కోసం చేయలేదని.. యు.వి.క్రియేషన్స్‌తో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమాకు పని చేసినట్లు ఆయన తెలిపారు.
తన కెరీర్ డల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు యూవి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ తనకు మహానుభావుడు, భాగమతి లాంటి సినిమాలు ఇచ్చారని.. ఆ సమయంలో తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన వాళ్ల కోసం ఇప్పుడు కృతజ్ఞత చూపించాను అంటున్నారు తమన్. ఆ రెండు సినిమాల కారణంగానే తన కెరీర్ ఇంత అద్భుతంగా ఉందని.. అందుకే రాధే శ్యామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించినట్లు తెలిపారు తమన్.
సినిమా చూస్తున్నప్పుడు ఒక తెలియని ట్రాన్స్‌లోకి వెళ్లిపోయానని.. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు ఈయన. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతోందని.. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ రాధే శ్యామ్ సినిమా కూడా ఉన్నట్లే అంటున్నారు తమన్. అంత నిజాయితీ ఉన్న ప్రేమ కథ ఇది అని తెలిపారు ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్.
ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరే అని తెలిపారు తమన్. గతంలో సాహో సినిమా ట్రైలర్‌కు మాత్రమే ఆర్ఆర్ అందించే అవకాశం వచ్చిందని.. ఇప్పుడు సినిమా మొత్తానికి రీ-రికార్డింగ్ అందించడం ఆనందంగా ఉంది అంటున్నారు తమన్. రాధే శ్యామ్‌పై ఈయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. గోపీకృష్ణ మూవీస్, యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మించాయి.