ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ వేర్వేరుగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. అటు ముందు రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేసాడు సుకుమార్.. ఆ తర్వాత రెండేళ్ళకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డులను తిరగరాసాడు.
అలాంటి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే అన్ని పాటల చిత్రీకరణ పూర్తైంది. కేవలం మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఎప్పట్లాగే సుకుమార్ మార్క్ మాస్ ఐటమ్ నెంబర్. తన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు సుక్కు.
తొలి సినిమా ఆర్య నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే ఐటం సాంగ్ పెట్టాడు లెక్కల మాస్టారు. టాప్ హీరోయిన్స్ కూడా ఈయన సినిమాల్లో ఐటం గాళ్స్గా మారిపోతుంటారు. ఇప్పుడు పుష్పలోనూ అదిరిపోయే మాస్ నెంబర్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ పాట కోసం పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి మాజీ అక్కనేని కోడలు సమంతను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతుంది.
సుకుమార్‌తో సమంతకు మంచి రిలేషన్ ఉంది. రంగస్థలం లాంటి సినిమా తనకు ఇచ్చాడనే కృతజ్ఞత కూడా ఉంది. అందుకే ఈ పాటలో నటించడానికి స్యామ్ కూడా ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులు వేయడానికి సిద్ధమవుతుంది సమంత. పైగా ఈ కాంబినేషన్లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది. అప్పట్నుంచే సమంత, బన్నీ మంచి స్నేహితులు.