మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఆ మధ్య ఆగస్ట్ 9న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అందులో మహేష్ బాబును చూసి వింటేజ్ బాబు ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు దర్శకుడు పరశురామ్‌కు కూడా థ్యాంక్యూ చెప్తున్నారు. ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ రాసి పెట్టుకోండి అంటూ మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ధి మరీ చెప్తున్నారు.
ఏంటి అంత కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు.. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. ఓ సెంటిమెంట్ ప్రకారమే సర్కారు వారి పాట బ్లాక్‌బస్టర్ అని నమ్మకంగా చెప్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్ పని చేసిన దర్శకులు చాలా మంది ఆయనకు గుర్తుండిపోయే విజయాలే ఇచ్చారు. నాటి గుణశేఖర్ ఒక్కడు నుంచి నిన్నటి అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు వరకు.. మహేష్ బాబుతో తొలిసారి పని చేసినపుడు మంచి విజయాలే ఇచ్చారు.
ఇక్కడ అతిథి సినిమాతో సురేందర్ రెడ్డి.. స్పైడర్ సినిమాతో మురుగదాస్ లాంటి దర్శకులు మహేష్ బాబుతో తొలిసారి పని చేసినపుడు నిరాశ పరిచారు. అయితే 90 శాతం మంది దర్శకులు మాత్రం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు సర్కారు వారి పాటకు కూడా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఎప్రిల్ 1, 2022న సర్కారు వారి పాట విడుదల కానుంది.